దేశంలోనే తొలి ఈ-ట్రాక్టర్‌

Jan 20,2025 00:31

ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చంనాయుడు
ప్రజాశక్తి – పెదకాకాని :
దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రికల్‌ ట్రాక్టర్‌ను మురుగని గ్రూపు సంస్థ ప్రవేశపెట్టగా షోరూంను స్థానిక ఆటో నగర్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చంనాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల వినియోగం క్రమంగా తగ్గిస్తూ ఎలక్ట్రికల్‌ బస్సులు, కార్లు, టూవీలర్స్‌ ప్రజలు వాడుతున్నారని చెపాపరు. ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఎలక్ట్రికల్‌ ట్రాక్టర్‌ను రైతులకు అందుబాటులోనికి తేవడం శుభ పరిణామమన్నారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువకాలం సేవలు అందించే ఈ ట్రాక్టర్‌ రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ పనులకు సాధన ట్రాక్టర్లను రైతులు ఏ విధంగా వినియోగిస్తారో ఈ ట్రాక్టర్‌ను అదేవిధంగా ఉపయోగించవచ్చునన్నారు. గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల్లో ఇలాంటి ట్రాక్టర్లు తీసుకువచ్చేలా ఆలోచన చేస్తామన్నారు. రైతులకు సబ్సిడీతో ఈ ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఛార్జింగ్‌ స్టేషన్లో అందుబాటులోకి తెచ్చేలా సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సోలార్‌ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ వాతావరణ, ధ్వని కాలుష్యాన్ని నివారించి, గ్రీన్‌ ఎనర్జీని పెంపొందించడానికి ఎలక్ట్రికల్‌ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. మురుగన్‌ గ్రూప్‌ సీఈఓ కె.హరిచంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఐదు గంటలు ఛార్జింగ్‌ పెడితే ఐదు టన్నుల భారాన్ని ఈ ట్రాక్టర్‌ మోయగలదన్నారు. అన్ని పరీక్షలూ చేసిన తర్వాతే రైతులకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

➡️