ఈ ఏడాదీ ఉత్సవ కమిటీతోనే జాతరా?

Dec 4,2024 21:59

ప్రనజాశక్తి – మక్కువ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవతగా ఖ్యాతి గడించి మాజీ డిప్యూటీ సిఎం పీడిక రాజన్నదొర కృషితో గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రస్థాయి గిరిజన జాతరగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈ ఏడాది కూడా ఉత్సవ కమిటీతోనే నిర్వహణ జరిగేలా ఉంది ప్రస్తుత పరిస్థితులను బట్టి. ఈనెల 27న పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకురావడంతోనే జాతర ప్రారంభమవుతుంది. అయితే జనవరి 27, 28, 29 తేదీల్లో ప్రధాన జాతర జరగనుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా ట్రస్టు బోర్డులు నియామకానికి పోలమాంబ ఆలయాల గురించి ఏ విధమైన నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. గత ఏడాది కూడా అప్పటి ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుకు అవకాశం ఉన్నప్పటికీ కొన్ని రాజకీయాల నేపథ్యంలో ఉత్సవ కమిటీనే ఏర్పాటు చేసింది. ఈ ఏడాదీ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు కాకపోవడంతో పలువురు కూటమి ప్రభుత్వం నుంచి ఆశావాహుల ఆశలపై చల్లినట్లే అనిపిస్తోంది. ఈసారి జాతరకు అటు ట్రస్ట్‌ బోర్డ్‌ అయినా ఇటు ఉత్సవ కమిటీ అయినా 50శాతం మహిళలకు రిజర్వేషన్‌తో పాటు అర్చక, నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించే ఆస్కారం ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి దేవాలయాల అన్నింటికీ వీటిని వర్తింప చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం విధితమే. ప్రస్తుత పోలమాంబ జాతరకు సంబంధించి అర్చకల నుంచి స్థానికంగా ఉండే వారికి ఉత్సవ కమిటీ లేదా ట్రస్ట్‌ బోర్డులో చోటు దాదాపు ఖరారైయినట్లే. అలాగే నాయి బ్రాహ్మణుల విషయానికి వస్తే ఎవరికి చోటు కల్పిస్తారన్నది ప్రస్తుతం చర్చని అవసరం అవుతోంది. ఇదిలా ఉండగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన మార్కు ఉండేలా ఉత్సవ కమిటీ లేదా ట్రస్టు బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయని ప్రచారం కూడా జోరం అందుకుంది. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన అమ్మవారి ధర్మకర్తల కమిటీల విషయంలో శంబర గ్రామానికి ప్రాధాన్యత ఆనవాయితీగా వస్తుంది. ఈసారి రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కడంతో కొంత శాతం వరకు నియోజకవర్గంలో లేదా మండల స్థాయి వ్యక్తులకు చోటు కల్పించే ఆస్కారం కూడా లేకపోలేదని పలువురు భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఎందుచేతనంటే కూటమి ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగతను నింపుకునేందుకు ఇక్కడ పదవులు దోహదపడతాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పోలమాంబ అమ్మవారి ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ లేదా ఉత్సవ కమిటీ అధ్యక్షుడి పదవుల కోసం శంబర గ్రామానికి చెందిన కొప్పుల వెలమ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ ఇద్దరు పేర్లు కూటమి ప్రభుత్వం నియోజకవర్గస్థాయి నాయకులు పరిశీలన చేస్తున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి వారు ఈ పదవుల కోసం పైరవీలు సాగిస్తున్నారు.

➡️