ప్రజాశక్తి – నంద్యాల అర్బన్ : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ ఇంకా దళితుల్ని అంటరానివారీగా చూస్తూ వారిపై దాడి చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈనెల 10వ తేదీ నంద్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు అనే దళితుడుపై అయ్యప్ప మాల వేసుకున్న ఉపేంద్ర అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. దానికి కారణం.. వెంకటేశ్వర్లు తన పిల్లలకు బైకుతో ఎందుకు గుద్దబోయావు అని అడగడమే తప్పు అయింది. ఆయనపై పాశవికంగా దాడి చేశారు. దీంతో ఆవేదనతో వెంకటేశ్వర్లు మీడియాను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ నెల పదవ తేదీన ఒకటో వార్డు హరిజనవాడకు చెందిన వెంకటేశ్వర్లు తన పిల్లలను ఐదో వార్డ్ లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూలు వద్దకు వదిలేయడానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఉపేంద్ర అనేవ్యక్తి రుయ్ మంటూ బైక్ పై వేగంగా వచ్చి పిల్లలకు బైకు తగిలించగా బైక్ ఎందుకు తగిలించావు చూసుకుని బైక్ నడపకూడదా అని వెంకటేశ్వర్లు ప్రశ్నించాడు. దీంతో ఉపేంద్ర వెంకటేశ్వర్ల చొక్కా కాలర్ పట్టుకుని తన ఇంటి దగ్గర కు తీసుకెళ్లాడు. ఆయనతోపాటు అక్కడున్న కోలా పెద్ద రామయ్య, ఆయన సతీమణి, కోల నాగరాజు, ఆయన భార్య, కోలా శివ, ఆయన భార్య.. వీరంతా వెంకటేశ్వర్లను మూకుమ్మడిగా అందరూ చూస్తుండగానే పాశవికంగా దారుణాతి దారుణంగా రోడ్డుపై పడేసి కొట్టారు. దాడి చేసిన వారిలో ఉపేంద్రతోపాటు, శివ అనే వ్యక్తి కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు. అయితే సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్న కేసు నమోదు చేయకుండా అడ్డుపడటమే కాకుండా, తమపై కేసు పెడితే చంపుతామంటూ బెదిరిస్తున్నారని మంగళవారం బాధితుడు వెంకటేశ్వర్లు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన సంఘటన తెలుసుకున్న దళిత ప్రజా సంఘాలతో పాటు ఎంఆర్పిఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులైన వెంకటేశ్వర పై దారుణంగా దాడి చేసిన వారిని పై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని, వెంకటేశ్వర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీని, జిల్లా కలెక్టర్ ని కోరారు.
