దస్తగిరి రెడ్డి దాడి కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు : పులివెందుల డిఎస్పి మురళి నాయక్‌

ప్రజాశక్తి-పులివెందుల రూరల్‌ (కడప) : దస్తగిరి రెడ్డి దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల డిఎస్పి మురళి నాయక్‌ వెల్లడించారు. సోమవారం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … జనవరి 29వ తేదీన తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన దస్తగిరి రెడ్డి పై జరిగిన దాడి కేసులో నలుగురు ముద్దాయిలకుగాను, ముగ్గురుని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. జనవరి 29వ తేదీన ఇనుగనూరు గ్రామానికి చెందిన దస్తగిరి రెడ్డి అలియాస్‌ బాబు రెడ్డి సొంత పని నిమిత్తం పులివెందులకు వచ్చారని, తన పని చేసుకుని తిరిగి గ్రామానికి వెళుతున్న సమయంలో గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన మొరంరెడ్డి సమరసింహా రెడ్డి, మొరంరెడ్డి హరి కిషోర్‌ రెడ్డి అలియా కిషోర్‌ కుమార్‌ రెడ్డి, మొరంరెడ్డి బాల ఓబుల్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డిలు కాపుకాసి దస్తగిరిపై దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌ కుమార్‌ ఆదేశాల మేరకు పులివెందుల బి.మురళి నేతఅత్వంలో పులివెందుల రూరల్‌ సీఐ రమణ ఆధ్వర్యంలో సింహాద్రిపురం ఎస్సై తులసి నాగ ప్రసాద్‌ , తొండూరు ఎస్సై చిన్న ఓటన్న, వారి సిబ్బందికి సైదాపురం క్రాస్‌ రోడ్డు, పులివెందుల ముద్దనూరు మెయిన్‌ రోడ్డు తొండూరు మండలంలో ఉన్న ముగ్గురు ముద్దాయిల గురించి సమాచారం అందిందన్నారు. దీంతో సోమవారం ఉదయం సింహాద్రిపురం ఎస్‌ఐ, తొండూరు,పోలీసు స్టేషన్‌ ఇన్‌ చార్జ్‌ తులసి నాగ ప్రసాద్‌ కలిసి నిందితులను వెంటనే అరెస్టు చేశారని తెలిపారు. విచారించిన తర్వాత ఈ కేసులోని ఫిర్యాది, ముద్దాయిలు అందరూ తొండూరు మండలం ఇనగనూరు గ్రామానికి చెందిన వారేనని అన్నారు. అయితే ముద్దాయిలు తమ వ్యవసాయ పొలం లో వేసిన సుమారు రెండు సంవత్సరాల క్రితం నాటి సుమారు 350 చీనీ చెట్లకు కరువు పని బిల్లులు చేయించుకునే విషయమై, దస్తగిరి రెడ్డి, ముద్దాయిలకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని తెలిసిందన్నారు. అరెస్ట్‌ కాబడిన ముద్దాయిల బంధువు ఒక దినపత్రికలో రిపోర్టర్‌ గా పనిచేస్తున్న నల్లచెన్నగారి భాస్కర్‌ రెడ్డి అని చెప్పారు. తొండూరు ఎంపీడీవో కార్యాలయంలో సదరు చీనీ చెట్లకు కరువు బిల్లులు విషయమై జనవరి 2.వ తేదీన అడిగినట్లు తెలిపారు. దీనిపై దస్తగిరికి చెందిన వ్యక్తులు సదరు భాస్కర్‌ రెడ్డిని జనవరి 3 న తొండూరు లో కొట్టినట్లు తెలిసిందన్నారు. దీనికి సంబంధించి తొండూరు పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయిందన్నారు. ముద్దాయిల విషయంలో దస్తగిరి రెడ్డి, అడ్డుపడుతున్నాడన్న కోపంతో దస్తగిరి రెడ్డిని ఎలాగైనా చంపాలని ముద్దాయిలు నిర్ణయించుకుని, ముందుగా అనుకున్న ప్రకారం … 29వ తేదీ ఉదయాన్నే తన పని మీద మోటార్‌ సైకిల్‌ పై రెడ్డి పులివెందుల కు వెళ్లాడని చెప్పారు. ముద్దాయిలు ఇనుప రాడ్లతో పులివెందులకు పోయి, ఫిర్యాది తిరిగి వస్తుండగా అదే అదునుగా భావించి పులివెందుల జేఎన్టీయూ కాలేజ్‌ వద్ద ఇనుప రాడ్లతో దాడి చేశారన్నారు. దీనికి సంబంధించి ఈ కేసులో మరో ముద్దాయి అయిన భాస్కర్‌ రెడ్డి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని అతని గాలిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అతడిని కూడా అరెస్ట్‌ చేస్తామన్నారు. అలాగే పులివెందుల సబ్‌ డివిజన్‌ పరిధిలో 18 గ్రామాలను ఫ్యాక్షన్‌ గ్రామాలుగా గుర్తించామని, ఈ 18 గ్రామాలను ఏబిసిడి గా గుర్తించి ఎ ఏలో రెండు గ్రామాలు, బిలో ఆరు గ్రామాలు, సి లో నాలుగు గ్రామాలు, డీలో ఆరు గ్రామాలు ఈ గ్రామాలలో సంబంధించి కౌన్సెలింగ్‌ కూడా ఇస్తామని ఫ్యాక్షన్‌ జాడలే లేకుండా చేస్తామని వివరించారు. మానవ ప్రాణానికి ఎలాంటి హాని కలిగించిన ఉపేక్షించేది లేదని, అలాగే సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️