స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల బందోబస్తు : జిల్లా ఎస్పీ

May 15,2024 17:50 #krishna

ప్రజాశక్తి -కలక్టరేట్ ( కృష్ణా) :జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఓటింగ్ కు సంబంధించిన ఈవీఎం బాక్స్లను కౌంటింగ్ కేంద్రమైన మచిలీపట్నం కృష్ణ విశ్వవిద్యాలయంలో భద్రపరిచామని  జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. స్ట్రాంగ్ రూముల చుట్టుపక్కల మూడంచెల భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాటికి భద్రత కల్పించడం జరిగిందన్నారు. అంతేకాక నిరంతరం సీసీ కెమెరాల పరిరక్షణ తో పాటు కృష్ణా విశ్వవిద్యాలయ చుట్టుపక్కల ఒక కిలోమీటర్ పరిధిలో సెక్షన్ 144 అమలులో ఉంటుందన్నారు.ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. ఈ నిబంధనలు జూన్ 4వ తేదీ కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు అమల్లో ఉంటుందన్నారు. బహిరంగ సభలు మరియు ఇతర ఎటువంటి ఎన్నికల ప్రచారానికైనా ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. బహిరంగ ప్రదేశాలలో, ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగేలా బాణసంచాలు కాల్చడం, అధిక శబ్దాలతో సౌండ్ బాక్స్ లను వినియోగించడం వంటిది చేయరాదన్నారు. ఈ నియమ నిబంధనలు ఏ ఒక్కరు పాటించకపోయినా చట్ట ప్రకారం శిక్షార్హుల అవుతారని కనుక ప్రతి ఒక్కరు పోలీసు వారికి సహకరించాలన్నారు.

➡️