కొల్లిపర మండలంలో ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రైతులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం తుపాను మారిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి చలిగాలులు తీవ్రమయ్యాయి. ఆకాశం మేఘావృతమై డెల్టాలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు ప్రారంభమయ్యాయి. కొల్లిపర మండలంలో శుక్రవారం సాయంత్రం జల్లులు పడటంతో రైతులు అప్రమత్తమయ్యారు. కోతలు పూర్తయ్యి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని, బస్తాల్లో ఉంచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. టార్ఫాలిన్ పట్టాలు తెచ్చుకుని పంటపై కప్పుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు శనివారం ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండకపోవచ్చని, మోస్తరుగా వర్షాలు పడే సూచనలున్నట్టు చెబుతున్నారు. దీంతో రైతులు కూడా వరి కోతలను కొద్ది రోజులు వాయిదా వేసుకుంటున్నారు. కోసిన తరువాత వర్షం వస్తే వరిపనలు తడిసి అధిక నష్టం వాటిల్లుతుందని, కోతలు రెండ్రోజులు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శీతాకాలం ప్రభావంతో పాటు తుపాను ప్రభావంతో చలిగాలులుతీవ్రం అయ్యాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. చలి గాలుల ప్రభావంతో విద్యుత్ వినియోగం కొంత తగ్గిందని అధికారులు చెబుతున్నారు.