టిడ్కో గృహా లబ్ధిదారులు రుణగ్రస్తులయ్యారు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు

గుంటూరు : టిడ్కో గృహాల లబ్ధిదారులను ప్రభుత్వాలు రుణగ్రస్తులను చేశాయని, గఅహ సముదాయాలలో మౌలిక సదుపాయాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు విమర్శించారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా … ఆదివారం గుంటూరులోని టిడ్కో గృహ సముదాయాలను బాబురావు, నగర కార్యదర్శి కె. నళిని కాంత్‌, ఇతర నగర నాయకులు సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ … లబ్ధిదారులు బ్యాంకులో నుండి మూడున్నర లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 15 నుంచి 20 ఏళ్ల కాలంలో దాదాపు పదిన్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అసలు కంటే వడ్డీనే అధికంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇల్లు ఇస్తామని చేసిన వాగ్దానం అమలు కాలేదు అని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకొని లబ్ధిదారుల రుణాలను వడ్డీతో సహా భరించాలని కోరారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం
ఆరు కుటుంబాలకు సరిపోయే సరిపడే ట్యాంక్‌ నిర్మించి 16 కుటుంబాలకు సరఫరా చేస్తున్నారని, అది కూడా రోజు మార్చి రోజు, గంట సేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయని, మురుగు నీరు వస్తుందని, తాగటానికి ఉపయోగ పడట్లేదని లబ్ధిదారులు నాయకులకు తెలిపారు. సచివాలయం లేదని, రేషన్‌, పెన్షన్‌ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రావట్లేదన్నారు. ప్రతి నెల ముసలివాళ్ళతో సహా గతంలో తాము నివసించిన ప్రాంతాలకు వెళ్లి పెన్షన్‌ తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. నగరానికి దూరంగా ఉండటం వల్ల పనులు కూడా ఉండట్లేదని, పనుల కోసం నగరంలోకి వెళ్ళటానికి రోజుకు 50 నుంచి వంద రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. తమ చెల్లించిన డిపాజిట్‌ సగం తిరిగి ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు అన్నారు. మా సమస్యలు పరిష్కరించాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ముళ్ళ చెట్లను శుభ్రం చేయించాలని కోరారు. కొందరు డిపాజిట్‌ చెల్లించిన ఇల్లు కేటాయించలేదని రిజిస్ట్రేషన్‌ చేయలేదని, కానీ వడ్డీ కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు నికల్సన్‌, లూధర్‌ పాల్‌, మస్తాన్వలి, కాసిం షహీద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️