మాట్లాడుతున్న చైర్మన్ నరశింహారావు
ప్రజాశక్తి – మాచర్ల : పట్టణంలో టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని, లేనిపక్షంలో వారు చెల్లించిన నగదును తక్షణమే వారికి తిరిగివ్వాలని కౌన్సిలర్ సుభాని డిమాండ్ చేశారు. చైర్మన్ పోలూరి నరసింహారావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఎజెండాలోని 42 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. కౌన్సిలర్ సుభాని మాట్లాడుతూ అభివృద్ధి పనులకు తక్షణమే టెండర్లు వేసి పనులను ప్రారంభించేటట్లు చూడాలని కోరారు. ఆవులు బెడదను పూర్తిస్థాయిలో నివారించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా వాడుతున్నారని, వెంటనే అరికట్టాలని కోరారు. చైర్మన్‌తోపాటు కమిషనర్ వేణుబాబు సమాధానమిస్తూ టిడ్కో గృహాల సంబంధించి జిల్లా కలెక్టర్‌కు వివరించామని, కలెక్టర్ నివేదిక రాగానే లబ్ధిదారులకు తిరిగి నగదును ఇవ్వటం లేదా, గృహాలు కేటాయించడం చేస్తామని చెప్పారు. గతంలో సుమారు 65 ఆవులు రోడ్లపై సంచరించేవని, వాటిలో 50 ఆవులను మున్సిపల్ పార్కుకు తరలించి, ఆవుల యజమానులను పిలిపించి, మొదటి తప్పిదంగా రూ.500 జరిమానా విధించి వదిలిపెట్టామని చెప్పారు. మిగతా ఆవులను కూడా త్వరలో గోశాలలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు నివారించేందుకు వ్యాపారస్తులతో అవగాహన కార్యక్రమం చేపట్టి నివారణకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే కవర్లు విక్రయించే విక్రయదారులను గుర్తించి జరిమానా విధించామని చెప్పారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సూచనల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు చైర్మన్ చెప్పారు. మరో కౌన్సిలర్ గట్ల అరుణకుమారి మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చే మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. నెహ్రు నగర్‌లోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మినీ పార్కులు ఏర్పాటుచేసి మొక్కలు నాటాలని సూచించారు. వేసవి దృష్ట్యా తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. హౌసింగ్ డిఈ బాలాజీ నాయక్ మాట్లాడుతూ స్థలం ఉండి గృహన్ని నిర్మించుకునే లబ్ధిదారులకు గతంలో ప్రభుత్వం నుండి రూ.1.80 లక్షలు వచ్చేవని, ఇప్పుడు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు మరో రూ.50 వేలు, ఎస్‌టిలకు రూ.75 వేలు పెంచినట్లు తెలిపారు. స్థలం ఉండి కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఈనెల 31 లోపు తమ పేర్లను హౌసింగ్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ చేసుకోవాలని కోరారు.
