టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి : సిపిఎం

Mar 9,2025 10:45 #cpm, #Tidco houses, #Visit, #Vizianagaram

ప్రజాశక్తి-బొబ్బిలి(విజయనగరం) : టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. పట్టణ పేదల కోసం రామన్నదొరవలస సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాన్ని సిపిఎం నాయకులు ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఇల్లు లేని పేదల కోసం గతంలో టిడిపి హయాంలో టిడ్కో ఇళ్లను మంజూరు చేసిందని, అప్పటిలో నిర్మాణాలు పూర్తి చేయలేదన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. లబ్ధిదారులతో డబ్బులు కట్టించుకుని బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇల్లు అప్పగించకుండానే బ్యాంకర్లు లబ్ధిదారులకు లోన్‌ చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. 1680 ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన పాలకులు నిర్మాణాలు పూర్తి చేయకపోవడం అన్యాయమన్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవన్నారు. తక్షణమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో లబ్ధిదారులతో ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్‌ ఎస్‌.గోపాలం, నాయకులు జి.శంకరరావు ఉన్నారు.

➡️