అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయం : సిఐటియు

అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయం : సిఐటియుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయమని, కార్మిక వర్గ పోరాటాల చరిత్ర పేజీలలో దీనికి ఒక ముఖ్యమైన స్థానం ఏర్పడిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. శని, ఆదివారాల్లో తిరుపతి జిల్లాలోని అంగన్వాడి కార్యకర్తలకు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమ శిక్షణా తరగతుల ప్రారంభ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్‌ వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కందారపు మురళి ప్రసంగిస్తూ అంగన్వాడీల పోరాటం కార్మికోద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల మనోభావాలకు భిన్నమైనవని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన లేదని… సమస్యల నుంచి పక్కదారి మళ్లించడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అంగన్వాడీలు జీతాల కోసం పోరాడే సంఘం కాదని సమాజ మార్పుకు దోహదం చేసే సంఘంగా పరిణితి చెందాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కేఎన్‌ఎన్‌ ప్రసాదరావు, స్వరూప రాణి, శ్యామలమ్మ, ముని కుమారి, ధనమ్మ, సౌజన్య, పుష్ప, రేవతి, రాజేశ్వరి, ఇంద్రావతి, నిర్మల, ప్రభావతి, మంజుల, హైమావతి, నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️