అప్రెంటిస్‌ షాక్‌

అప్రెంటిస్‌ షాక్‌

అప్రెంటిస్‌ షాక్‌ ప్రజాశక్తి తిరుపతి సిటీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. ఎట్టకేలకు డీఎస్సీ విడుదల అయ్యిందని సంతోషిస్తున్న అభ్యర్థులకు అప్రెంటిస్‌ పేరుతో గుదిబండ వేసింది. మెగా డీఎస్సీ ఆశలు ఆవిరైనా, కనీసం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారని సంబరపడుతున్న అభ్యర్థులను ప్రభుత్వ తీరు నిరాశపరిచింది. నిరుద్యోగులను ఆదుకుంటాం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం, భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ గత ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు బీరాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు పరిపాలించినా ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన మెగా డీఎస్సీ ఊసే ఎత్తలేదు. ఉన్నత చదువులు చదువుకొని, వేల రూపాయల ఖర్చు చేసి ప్రత్యేక శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఉసూరుమన్నారు. తమ చదువుల కోసం కుటుంబ సభ్యులు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగాయి, తమ వయసు పెరుగుతుందే గాని, ఉద్యోగం దొరకటం లేదని ఆవేదన చెందారు. ఉన్నత చదువులు చదువుకొని కుటుంబాల పోషణ కోసం విధి లేని పరిస్థితిలో కూలికి వెళ్లినవారూ లేకపోలేదు. ఈ దశలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని, నిరుద్యోగుల ఓటు బ్యాంకు ను రాబట్టేందుకు డీఎస్సీ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అది కూడా 6వేల పోస్టులకే పరిమితం చేయడంతో 60 వేల పైగా ఉన్న అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఉన్న కాడికి సర్దుకుందామంటూ దింపుడు కల్లం ఆశతో డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు, ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిస్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థితిలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో అభ్యర్థులు ఉన్నారు. డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయి విధుల్లో చేరిన తర్వాత 2 సంవత్సరాలు అప్రెంటిస్‌ చేయాలి. ఈ రెండు సంవత్సరాలు బేసిక్‌ వేతనంలో 50శాతం మాత్రమే చెల్లిస్తారు. ఇప్పటికే ఉన్నత చదువులు చదువుకొని, లక్షలాది రూపాయలు వెచ్చించి, సంవత్సరాల తరబడి ఎదురు చూసి, ఉద్యోగాలకు అవసరమైన వయో పరిమితులు కూడా దాటేస్తున్న పరిస్థితి నిరుద్యోగులది. తల్లిదండ్రుల ఇచ్చే కాస్తోకూస్తో పాకెట్‌ మనీతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తమ ప్రతిభకు పదును పెట్టి, అహర్నిశలు కష్టపడి, ఉద్యోగం సంపాదించినా మరో రెండేళ్లు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో డీఎస్సీ అభ్యర్థులు మనోవేదన తీవ్రమౌతుంది. అప్రెంటిస్‌ పునరుద్ధరణ సరైనది కాదు : నారాయణ, డిఎస్‌సి కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు అప్పటి పాలకులు అధికారులతో చర్చించి, డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు డీఎస్సీ అప్రెంటీస్‌ విధానం సరైనది కాదని నిర్ణయానికి వచ్చి రద్దు చేశారు. దాదాపు దశాబ్దం తర్వాత, అది కూడా కరోనా వంటి విపత్కర పరిస్థితులు తర్వాత దాన్ని పునరుద్ధరించడం సరైనది కాదు. దీనివల్ల డీఎస్సీ కి ఎంపికైన అభ్యర్థులు చాలా నష్టపోతారు. ప్రభుత్వం ఈ విధానంపై పునరాలోచించాలి.

➡️