అవ్వ తాతల పింఛన్లతో ఆటలొద్దు : అఖిలపక్షం

Apr 1,2024 21:18
అవ్వ తాతల పింఛన్లతో ఆటలొద్దు : అఖిలపక్షం

ప్రజాశక్తి – యంత్రాంగం పింఛన్ల పంపిణీలో పొలిటికల్‌ చీప్‌ట్రిక్స్‌ ప్రయోగించొద్దని అఖిలపక్షం నేతలు విజ్ఞప్తి చేశారు. గతంలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బంది ద్వారా అనేక సంవత్సరాల పాటు పట్టణాలలో, గ్రామాలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందని, ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాలంటీర్లను దూరం పెట్టి, పాత పద్ధతిలో త్వరితగతిన పింఛన్లు అందించేలా ఎపీ చీఫ్‌ సెక్రటరీ దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేవారు. ఎన్నికల సంఘం ఆదేశాలనున బూచిగా చూపి ఉద్దేశపూరకంగా పింఛన్లు అందకుండా, ఆలస్యం చేసే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. బుచ్చినాయుడు కండ్రిగలో ఒకటో తేదీనే పింఛన్లు ఇంటింటికి ఇవ్వాలని టిడిపి మండల ప్రెసిడెంట్‌ సుధాకర్‌నాయుడు ఆధ్వర్యంలో ఎంపిడిఒ ప్రతాప్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మండలంలో 5,262 పింఛన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. మండల ఆఫీసుల్లోనూ, సచివాలయాల్లోనూ 140 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరి ద్వారా ఇంటింటికీ యథావిధిగా పింఛన్లు అందజేయాలని కోరారు. గూడూరులో ఎన్‌డిఎ కూటమి టిడిపి అభ్యర్థి పాశిం సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి సచివాలయంలో 8-15 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వీరి ద్వారానే పింఛన్లు ఇంటింటికి ఇవ్వాలని కోరారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో 40వేల మందికి పైబడి పెన్షన్‌ మొత్తం 10 కోట్ల 62 లక్షల రూపాయలు ఏప్రిల్‌ ఒకటో తేదీన చెల్లించాల్సి ఉండగా, ట్రెజరీ ఖాతాలో జమయ్యిందో లేదో రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. వెంకటగిరిలో ఈనెల మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ పింఛన్లను పంపిణీ చేస్తామని మండల అభివృద్ధి అధికారి నీలకంఠేశ్వరరావు తెలిపారు.

➡️