టీటీడీ కళాశాలల విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు- టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి- 215 మంది విద్యార్థులకు అఛీవర్‌ అవార్డులు ప్రదానం

టీటీడీ కళాశాలల విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు- టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి- 215 మంది విద్యార్థులకు అఛీవర్‌ అవార్డులు ప్రదానం

టీటీడీ కళాశాలల విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు- టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి- 215 మంది విద్యార్థులకు అఛీవర్‌ అవార్డులు ప్రదానంప్రజాశక్తి -తిరుపతి సిటీ : శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులనీ, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని టిటిడిఈఓ ధర్మారెడ్డి సూచించారు. స్థానిక మహతి ఆడిటోరియంలో శుక్రవారం స్టూడెంట్స్‌ సక్సెస్‌ మీట్‌ – అఛీవర్‌ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. అకడమిక్స్‌, ఎన్‌.సి.సి, ఎన్‌ఎస్‌ఎస్‌, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, కల్చరల్‌, కో కరికులర్‌, కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌, ప్లేస్మెంట్స్‌ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 215 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సందర్భంగా 5 గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని 27 విద్యాసంస్థల విద్యార్థులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అవార్డులు అందించడం ఎంతో సంతోషకరమన్నారు. అధ్యాపకులు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా చక్కగా చూసుకోవాలని, అవసరమైన పక్షంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కూడా అధ్యాపకుల పట్ల గౌరవభావంతో మెలిగి బాగా చదువుకోవాలని కోరారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చేందుకు త్వరలో 120 మంది జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టీటీడీ విద్యార్థులు అంకితభావం, ఏకాగ్రతతో బాగా చదువుకుని వారు కోరుకున్న ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈవో ఆకాంక్షించారు. టీటీడీ జెఈఓ సదా భార్గవి మాట్లాడుతూ విద్య కొనబడకూడదు, అమ్మబడకూడదు అనే మహౌన్నత లక్ష్యంతో టీటీడీ విద్యాసంస్థలను నిర్వహిస్తోందని, ఇక్కడి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా విద్యనభ్యసించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థులకు ఔట్‌ డోర్‌ టూర్‌ ఏర్పాటుచేసి పలు వైజ్ఞానిక విషయాలు తెలుసుకొనే అవకాశం కల్పించాలన్నారు. స్వామివారి అనుగ్రహంతో విద్యాసంస్థలను భవిష్యత్తులోనూ టీటీడీనే నిర్వహించాలని ఈ సందర్భంగా ఈవోను జెఈవో కోరారు. ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో విజయం మాత్రమే ఉందని, పరాజయం లేదని, అపజయంలో కూడా కొత్త విషయాలను నేర్చుకుని విజయంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇతరులను పోటీగా భావించరాదని, మీతో మీరే పోటీపడి అనుకున్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. శారీరక వికాసం కోసం క్రీడలు, యోగ సాధన చేయాలని, మానసిక వికాసం కోసం పుస్తక పఠనం అలవరుచుకోవాలని కోరారు. టీటీడీ ముఖ్య గణాంకాధికారి శేషశైలేంద్ర మాట్లాడుతూ టీటీడీ విద్యార్థులకు విద్యతో పాటు ఆర్ష విజ్ఞానాన్ని బోధించాలని, తద్వారా వారిని ఆధ్యాత్మికంగా జ్ఞానవంతులను చేయాలని కోరారు. సనాతన ధర్మంలోని పలు వైజ్ఞానిక విషయాలను విద్యార్థులకు బోధించాలన్నారు. జీవితంలో కష్టపడి మనం అనుకున్న స్థాయికి చేరుకోవడం అఛీవ్‌ మెంట్‌ అని, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు చేయడం సక్సెస్‌ అని తెలిపారు. టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్‌ ఎం.భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ ఒకే మేనేజ్మెంట్‌ ఆధ్వర్యంలోని మూడు కళాశాలలకు న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ తో పాటు అటానమస్‌ హౌదా రావడం చారిత్రకమైన విషయం అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 27 విద్యాసంస్థలు, ఆరు వేద పాఠశాలలు ఉన్నాయని, మొత్తం దాదాపు 20వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు టీటీడీ విద్యా కానుక కిట్లను అందజేసిందని, ఎన్‌.సి.సి విద్యార్థులు క్యాంపులు నిర్వహించేందుకు ఆర్థిక సాయం అందజేస్తోందని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు భక్తిభావనతో చక్కగా చదువుకుని, టీటీడీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి పీఆర్‌ఓ పి.నీలిమ, డాక్టర్‌ కష్ణవేణి, ఎస్వీ సంగీత కళాశాల హరికథ విభాగం అధ్యాపకులు వెంకటేశ్వర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విద్యా విభాగం సలహాదారు ఎల్‌ఆర్‌.మోహన్‌ కుమార్‌ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️