నేతలు సేఫ్‌

Feb 11,2024 22:33

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో అధికారపార్టీకి కొమ్ము కాసిన అధికారులు ఒక్కొ రోజు ఒక్కొక్క అధికారి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఇంతకుముందు తిరుపతి మున్సిపల్‌ మాజీ కమిషనర్‌, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా పనిచేసి సస్పెన్షన్‌కు గురైన గిరీష తరువాత తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసి విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బదిలీ అయిన చంద్రమౌలీశ్వర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత తిరుపతి అర్బన్‌ తహశీల్దార్‌గా పని చేసిన జయరామయ్య, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసిన భాస్కర్‌ను సస్పెండ్‌ చేయడమే కాకుండా తిరుపతి అర్బన్‌ తహీల్దార్‌ కార్యాలయంలో పనిచేసిన ఔట్సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లను గతంలో ముగ్గురిని సస్పెండ్‌ చేయడం జరిగింది. ఇప్పటివరకు 22మందిని ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేయడం విశేషం. తాజాగా పోలీసులను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ కావడంతో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు మొత్తం దొంగ ఓట్లతోనే అధికార పార్టీ గెలిచిందని భావన ప్రజల్లో ఏర్పడింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్రిమినల్‌ కేసు నమోదు చేయడానికి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. దొంగ ఓట్లు వేసిన వారిని ప్రతిపక్ష పార్టీలు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిన వారు విడిచిపెట్టడమే కాకుండా సాక్షం కూడా తారుమారు చేశారని ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరిపై ఆగ్రహంతో ఉంది. ప్రతిరోజు అధికారులు సస్పెండ్‌ అవుతుండగా రాజకీయ నేతలు మాత్రం సేఫ్‌గానే ఉన్నారని నగరవాసులు చర్చించుకుంటున్నారు.సాక్షులను కాపాడమే పోలీసులు చేసిన నేరం… ప్రతిపక్ష పార్టీలు తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో దొంగఓట్లు వేసిన వారిని జిల్లా ఎస్పీతోపాటు తిరుపతి తూర్పు పడమర అలిపిరి పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అప్పజెప్పడం జరిగింది. అయితే అధికార పార్టీ వాళ్లు ఈ పని చేయించడం వల్ల పోలీసులపై నేతల ఒత్తిడితో వారిని వదిలిపెట్టారు. దాని ఫలితం ఇప్పుడు పోలీసులు సస్పెండ్‌ గురికావడం విస్మయం కలిగిస్తుంది. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో 35 దొంగఓట్లు సష్టించడం జరిగింది. అయితే ఈ ఓట్లు అలాగే ఉన్నాయా రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఓట్లు తొలగించారా లేదా అన్న అనుమానాలు ఓటర్‌కు కలుగుతుంది. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం రోజురోజుకూ ముదిరిపోతోంది. ఇది వరకే టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం రాష్ట్రంలో దొంగ ఓట్లపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.పోలీసులపై ఈసీ కొరడా.. తిరుపతి ఈస్ట్‌, వెస్ట్‌ సీఐలతో పాటు తూర్పు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై జయస్వాములు, హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారకానాథ్‌ రెడ్డిని సైతం ఈసీ సస్పెండ్‌ చేసింది. అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ అప్పటి సీఐ దేవేంద్ర కుమార్‌, విఆర్‌కు బదిలీ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో దొంగఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు చేసినా ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టించారని ఈ పోలీసులపై అప్పటినుంచి ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని కేసును కొట్టివేశారన్న సంగతి తెలిసిందే. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు. ఈక్రమంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక లో దొంగఓట్ల వ్యవహారంపై పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సమయంలో అప్పటి తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ సీఐలుగా విధులు నిర్వహించిన శివప్రసాద్‌ రెడ్డి, శివప్రసాద్‌లపై ఈసీ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

➡️