నేనంటే…నేనే..!టిడిపి బరిలో జెడి, హెలెన్‌సత్యవేడు టిక్కెట్‌ రేస్‌లో ఆరుగురు

నేనంటే...నేనే..!టిడిపి బరిలో జెడి, హెలెన్‌సత్యవేడు టిక్కెట్‌ రేస్‌లో ఆరుగురు

నేనంటే…నేనే..!టిడిపి బరిలో జెడి, హెలెన్‌సత్యవేడు టిక్కెట్‌ రేస్‌లో ఆరుగురుప్రజాశక్తి – నాగలాపురం సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ టిక్కెట్‌ రేస్‌లో ప్రధానంగా ఆరుగురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా జెడి రాజశేఖర్‌, డాక్టర్‌ హెలెన్‌ ‘నేనంటే నేనే’ అని నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. మరి అధిష్టానం చూపు ఎవరిపై ఉంటుందో వేచి చూడాల్సిందే. వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలంకు ఆ పార్టీ అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో ‘నాన్‌ లోకల్‌’కు ఈ సీటును కేటాయించారు. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఎవరిపై కరుణ చూపుతారో అన్న ఆసక్తి టిడిపి శ్రేణుల్లో నెలకొంది. 2019 ఎన్నికల్లో టిడిపి తరపున జేడీ రాజశేఖర్‌కు చంద్రబాబునాయుడు టికెట్‌ కేటాయించారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆదిమూలం 2019 ఎన్నికల్లో 47వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత కొంతకాలంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై జేడీ నిరసనలు తెలుపుతూ గ్రామాల్లో పర్యటించారు. అయితే సత్యవేడు టిడిపి ఇన్‌ఛార్జిగా మాజీ ఎంఎల్‌ఎ హేమలతను అధిష్టానం నియమించింది. నెలరోజులకే హేమలత కుమార్తె హెలెన్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఓ వైపు హెలెన్‌, హేమలత, మరోవైపు జేడీ రాజశేఖర్‌ వేర్వేరుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే వీరిద్దరి మధ్య సయోధ్యను మాత్రం అధిష్టానం కుదర్చలేకపోయింది. దీంతో రెండు గ్రూపులుగానే టిడిపి సత్యవేడులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరిని కాదని కొత్తవారిని తెరపైకి తెస్తే మంచిదని ఆశావాహులు సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్‌ పారిచందన స్రవంతి, రాజేష్‌కృష్ణ, సత్యవేడు మాజీ ఎంఎల్‌ఎ తలారి ఆదిత్య టికెట్‌ రేస్‌లో ప్రయత్నాలు ముమ్మరంచేశారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మి తన భర్తకు సత్యవేడు టికెట్‌ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తయితే సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం తాజాగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు నారా లోకేష్‌ను కలవడమూ ఆశావాహుల్లో గుబులు నెలకొంది. ఏదిఏమైనా ఆశావాహులందరినీ ఏకతాటిపైకి తెస్తారో లేదో వేచి చూడాలి. లేదంటే టిడిపికి ‘స్వతంత్ర’ అభ్యర్థుల పోరు తప్పదు.

➡️