పంట కాల్వ పూడ్చి..హైవే నిర్మాణం…రైతన్నకు శాపంఎండుతున్న 220 ఎకరాలు చేతులెత్తేసిన ఇరిగేషన్‌ అధికారులు

పంట కాల్వ పూడ్చి..హైవే నిర్మాణం...రైతన్నకు శాపంఎండుతున్న 220 ఎకరాలు చేతులెత్తేసిన ఇరిగేషన్‌ అధికారులు

పంట కాల్వ పూడ్చి..హైవే నిర్మాణం…రైతన్నకు శాపంఎండుతున్న 220 ఎకరాలు చేతులెత్తేసిన ఇరిగేషన్‌ అధికారులుప్రజాశక్తి- పెళ్లకూరు అన్నదాత పొట్టకొట్టి హైవే నిర్మాణం చేపట్టడమే పాలకుల దృష్టిలో అభివృద్ధిలా ఉంది.. నేషనల్‌ హైవే వారు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పంట కాల్వను పూడ్చేశారు. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల్లోని 220 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్‌ అధికారులతో రైతులు మొరపెట్టుకోగా తామేమీ చేయలేమని చేతులెత్తేయడం గమనార్హం. కళ్లెదుటే ఎండుతున్న పంటలను చూసి దిక్కుతోచని రైతులు లబోదిబోమంటున్నారు. పెళ్లకూరు మండలంలోని పెన్నేపల్లి గ్రామం వద్ద స్వర్ణముఖి నది నుంచి జువ్వలపాలెం, బిరదవాడ, ఉచ్చువారిపాలెం చెరువులకు వెళ్లే నీటి కాల్వను నేషనల్‌ హైవేవారు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పూడ్చేశారు. దీంతో మూడు నెలలుగా జువ్వలపాలెం, బిరదవాడ, ఉచ్చువారిపాలెం, కానూరు, పెన్నేపల్లి, తాళ్లాయిపాడు రైతులకు చెందిన దాదాపు 220 ఎకరాలు ఎండిపోతున్నాయి. కాల్వ పూడిక తీయాలని రోడ్డు నిర్మాణ ఉద్యోగుల చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నా బాధ్యతారాహిత్యంగా వీరి తీరు ఉందన్న విమర్శలున్నాయి. రమేష్‌, హరీష్‌, రామయ్య, మరికొంతమంది ఒకరిమీద ఎవరు సంబంధం లేదని చెప్పుకుంటూ రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. వర్షాధార పంలు పండించే తాము చెరువుల్లోకి నీరు పారకుండా పంట కాల్వ పూడ్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కడానికి సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో,కొండలు, గుట్టలు అక్రమంగా తవ్వడానికి అక్కడున్న మట్టి గ్రావెల్‌ తరలించడానికి ఉన్న ఉత్సాహం, రైతులు నష్టపోతుంటే కనీసం కనికరం చూపడం లేదన్నది అన్నదాతల ఆవేదన. పొలం పూర్తిగా ఎండిపోయింది : వెంకటాచలపతి, రైతు నా పేరు వెంకటాచలపతి. స్వర్ణముఖి నది నుంచి జువ్వలపాలెం చెరువుకు నీరు వెళ్లే కాల్వ పక్కన మా పొలాలు ఉన్నాయి. రోడ్డు పనులు చేసే సమయంలో తోలిన మట్టితో కాల్వ పూడిపోయింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా కాల్వ పూడిక తీయలేదు. హైవే వారిని మా రైతులు అనేకమార్లు కలిసాం. పట్టించుకోకపోవడం వల్ల చెరువులో నీరు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ కాలవే మా పంటలకు ఆధారం : బాలాజీ, పెన్నేపల్లి పెన్నేపల్లి గ్రామం దగ్గర స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల నుంచి నేషనల్‌ హైవే దాటుకుని చెరువులకు వచ్చే నీరు జువ్వలపాలెం కాల్వ ద్వారా ఆరు గ్రామాలకు వస్తుంది. బ్రిడ్జి నిర్మిస్తున్నపుడు ఆ కాల్వ పూడిపోయింది. హైవే వారిని అడిగితే తమకు సంబంధం లేదంటున్నారు. ప్రాధేయపడ్డా ఫలితం లేకపోయింది. చెరువుల్లో నీరు లేక 250 ఎకరాల పైరు ఎండిపోతోంది.

➡️