భూ కబ్జాదారుడు సిద్ధుల రవిని అరెస్టు చేయాలి..!

Feb 28,2024 22:20
భూ కబ్జాదారుడు సిద్ధుల రవిని అరెస్టు చేయాలి..!

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: కరకంబాడీ వద్ద ఎర్రగుట్టపై పేదలేసుకున్న గుడిసెలను తొలగించినందుకు, అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసిస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో వందలాది మందితో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం జరిగింది. దాదాపు 300 మంది పేదలు తమకు న్యాయం చేయాలంటూ ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ ఏమి నేరం చేశారని పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారని, పేదల పక్షాన పోరాడుతున్న సిపిఎం నేతలను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. భూ కబ్జాదారుడైన సిద్ధులు రవి పైన పోలీసుల ప్రతాపం చూపించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం పట్టాలి ఇచ్చిన, నివాస స్థలాలు అనువైన ప్రాంతంలో చూపకపోవడంతో పేదలు గుడిసెలు వేయాల్సి వచ్చిందని అన్నారు. కబ్జాదారులు ఆక్రమించిన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకొని పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలో జగనన్న పట్టాదారులకి స్థానికంగా స్థలాలు చూపించాలని కోరారు. పేదలకు స్థలాలు చూపేంతవరకు పోరాటాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిఆర్‌ఓ పెంచల కిషోర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం డిఆర్‌ఓ మాట్లాడుతూ 15 రోజుల్లో పేదలకు స్థలాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. సిపిఎం నాయకులు టి.సుబ్రమణ్యం, మాధవ్‌, జయచంద్ర, సాయిలక్ష్మి, వేణుగోపాల్‌, బుజ్జి, పార్థసారథి రెడ్డి, హరి, రాజశేఖర్‌, సెల్వరాజు, శివానందం, సత్య, ప్రకాష్‌, శీను సుజాతమ్మ, మమత, కుమారి, మునిరత్నం, బాదుల్లా, మోదీను, అమీదు పాల్గొన్నారు.

➡️