సత్యవేడులో రాజకీయ అనిశ్చితిఇరు పార్టీల్లోనూ గందరగోళం

సత్యవేడులో రాజకీయ అనిశ్చితిఇరు పార్టీల్లోనూ గందరగోళం

సత్యవేడులో రాజకీయ అనిశ్చితిఇరు పార్టీల్లోనూ గందరగోళంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సత్యవేడు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. వైసిపిలోనూ, టిడిపిలోనూ గందరగోళ పరిస్థితి. వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలంను పక్కన పెట్టి స్థానికేతరుడైన ఎన్‌.రాజేష్‌కు టిక్కెట్‌ను ఖరారు చేసింది. రాజకీయాలకు కొత్త, ఆ నియోజకవర్గానికి నాన్‌ లోకల్‌ కావడంతో వైసిపిలోనే కార్యకర్తలు, నాయకులు పెదవి విరుస్తున్నారు. మళ్లీ ఇక్కడ అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ఎంపిపిగా ఉన్న విజరుకు ఇవ్వాలని ఆదిమూలం వ్యతిరేకవర్గం బలపరుస్తోంది. టిడిపి పరిస్థితికి వస్తే ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆదిమూలం తిరుగుబావుటా ఎగురవేసి వెనువెంటనే నారా లోకేష్‌ ద్వారా చంద్రబాబును కలిసారు. తాజాగా నిన్న శుక్రవారం నారా భువనేశ్వరి పర్యటన సందర్భంగా ఆమెకు నారాయణవనంలో ఘన స్వాగతం పలికారు. ఈనెల 26న పసుపు కండువా కప్పుకుంటారని చర్చ నడుస్తోంది. టిడిపి నుంచి సత్యవేడుకు ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. మాజీ ఎంఎల్‌ఎ హేమలత కుమార్తె డాక్టర్‌ హెలెన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆమెకే టిక్కెట్‌ ఖరారు చేయాలని కొంతమంది పట్టుబడుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన జడ్డా రాజశేఖర్‌ మద్దతుదారులతో ఒత్తిడి తెప్పిస్తున్నారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోయినా ఆదిమూలంకు ఇవ్వరాదని, హెలెన్‌కు ఇస్తే సహకరిస్తానని బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి నుంచి ముగ్గురు టిక్కెట్‌ ఆశిస్తుండడంతో ఎవరికి ఇస్తారనే విషయమై అనిశ్చితి నెలకొంది. జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించే వ్యక్తి ప్రస్తుతం ఆదిమూలం. కాబట్టి ఆయనకే ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు సైతం పొత్తు ఖరారైన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ కుమార్తె చింతా నేహా బరిలో ఉంటారని సమాచారం. అలాగే ఎంటెక్‌ రవి కూడా కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

➡️