అనుమతులు రాక.. 4వే పనులు పూర్తి కాక..

అనుమతులు రాక.. 4వే పనులు పూర్తి కాక..

అనుమతులు రాక.. 4వే పనులు పూర్తి కాక..శ్రీ కడప – రేణిగుంట హైవే పనులతో ప్రయాణికులకు తప్పని కష్టాలుశ్రీ అటవీ శాఖ అనుమతులు లేక ఆగిన పనులుశ్రీ పట్టించుకోని ప్రజాప్రతినిధులుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ రేణిగుంట – కడప నాలుగు వరుసల జాతీయ రహదారి కల ఇప్పట్లో సాకారం అయ్యేలా కనిపించడం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో అటవీశాఖ అనుమతులు లభించలేదు. ఏదేని అభివృద్ధికి అధికారులతో పాటు రాజకీయ కోణంలో అధికారపార్టీ ప్రేరణ ఉండాలి. ఇలా లేకపోవడంతో ఇప్పటికే ఖరారు చేసిన టెండరును రద్దు చేసి మళ్లీ పిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియతో ఇప్పట్లో అతిపెద్ద రహదారి ప్రాజెక్టు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రయాణికులు, వాహన చోదకుల పాలిట శాపంగా మారింది.స్వామి పాదాల చెంత…. శ్రీవెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరునగరికి శ్రీనివాసుని తొలి గడప కడప నుంచి నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి కేంద్రం రెండేళ్ల కింద ఆమోద ముద్ర వేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్‌ఎ) టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. ఈ మార్గాన్ని రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి ఖరారు చేశారు. రేణిగుంట నుంచి కడప వరకు 130 కి.మీ రహదారి నిర్మాణం జరగనుంది. రేణిగుంట నుంచి రైల్వేకోడూరు వరకు ఇప్పుడున్న పాత రహదారిని వినియోగించుకోనుండగా.. రహదారిని వినియోగించుకోనుండగా.. రైల్వేకోడూరు నుంచి కడప వరకు మార్గం మధ్యలో ఎక్కడా గ్రామాలను తాకకుండా కొత్త రహదారి (గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు) నిర్మాణం చేపట్టనున్నారు. తిరుపతి జిల్లాలో 20 కి.మీ, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో 110 కి.మీ పొడవునా రహదారి ఉండనుంది. దాదాపు రూ.2,500కోట్ల అంచనాతో చేపట్టిన రహదారిని రెండేళ్లలో పూర్తి చేయాలనే గడువును నిర్దేశించారు. రేణిగుంట నుంచి కరకంబాడి, మామండూరు, బాలాపల్లె, శెట్టిగుంట వరకు ఇప్పుడున్న రహదారినే నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. రైల్వేకోడూరుకు ముందు భాగంలో బైపాస్‌ మార్గం ఏర్పాటుకు పనులు తలపెట్టారు. ఇక్కడ నుంచి అయ్యపురెడ్డిపల్లె, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, బాకరాపేట పడమర దిశగా రహదారి వెళ్లనుంది. ఈ రహదారి ప్రైవేటు భూముల సేకరణ చేపట్టి దాదాపు పరిహారం చెల్లింపులు జరిగాయి. అటవీశాఖ నుంచి దాదాపు 300 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. వీటికి ఎన్హెచ్‌ఎ అధికారులు వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా అనుమతులు రాలేదు.పట్టించుకోని ప్రతినిధులు….. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లేకపోవడం, రాజకీయంగా.. అధికార పార్టీ నుంచి సహకారం లేకపోవడంతో అనుమతుల జాప్యం జరుగుతోంది. ఈ మార్గం పరిధిలో ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు మట్టి పనులు చేపట్టగా.. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. టెండర్లు ఖరారు చేసి ఏడాది దాటిపోతున్నందున్న ఎస్‌ఎస్‌ఆర్‌ పెరుగుదల కారణంగా కొత్తగా టెండర్లకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రక్రియ అంతా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలంటే పనులు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి గత ఏడాది జులైలో కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో రహదారి నిర్మాణం ఆలస్యమవుతోంది.

➡️