ఉద్యమాల ఆయువుపట్టు అంగన్‌వాడీలు

ఉద్యమాల ఆయువుపట్టు అంగన్‌వాడీలు

ఉద్యమాల ఆయువుపట్టు అంగన్‌వాడీలుప్రజాశక్తి-తిరుపతి సిటి ఐసిడిఎస్‌ పరిరక్షణ, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధ సంస్థ) చేపట్టిన సమ్మె సఫలం అయ్యింది. 42 రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అంగన్‌వాడీలు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టిన విషయం విదితమే. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లో, 12 ప్రాజెక్టులు, 102 సెక్టర్లు పరిధిలో 3103 సెంటర్లలో పని చేస్తున్న 2412 మంది అంగన్‌వాడీ వర్కర్లు, 2049 మంది హెల్పర్లు, 661 మంది మినీ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు.అంగన్‌వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామన్న సిఎం హామీ నీటి మీద రాతగా మిగిలింది. సెంటర్ల నిర్వాహణకు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి అంగన్‌వాడీలు నెట్టబడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పేరుతో ఫుడ్‌కమీషనర్‌, ఎంఎస్‌కె, ఎంఆర్‌ఓ, ఎండివో, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అంగన్‌వాడీలను అవమానిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. అంగన్‌వాడీలకు ప్రభుత్వ హామీ మేరకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని, హెల్పర్లకు ప్రమోషన్‌ వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలని నినాదాలు చేస్తూ సమ్మె కొనసాగించారు. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఒకటి, రెండు రోజుల తర్వాత అధికారులు ఒత్తిడి ప్రారంభించారు. సమ్మె ప్రారంభమైన వారం రోజులకు ఒత్తిడి మరింత తీవ్రమైంది. ఎస్మా ప్రయోగించింది.చివరకు అంగన్‌వాడీలను తొలగించి, కొత్తవారిని తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాణం పొయినా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆపబోమని అంగన్‌వాడీలు మొక్కువోని దీక్షతో పట్టుబట్టారు. 22వ తేది ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అంతే ప్రభుత్వం తన కర్కశత్వాన్ని బయటపెట్టింది. అర్ధరాత్రి దీక్ష శిబిరంలో ఉన్న మహిళలను పురుష పోలీసులచేత అరెస్టులు చేయించారు. రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలో కుక్కారు. రాష్ట్ర మొత్తం నిద్రిస్తున్న సమయంలో ఖాకీల ద్వారా దాడులు ముమ్మరం చేశారు. తిరుపతి జిల్లాలో తిరుపతి కేంద్రంగా సుమారు 200 మంది అంగన్‌వాడీలను పోలీసులు అరెస్టు చేసి రహస్యంగా నిర్భందించారు. కనీసం ఆహారం, మంచినీళ్లు ఇవ్వలేదు. మరుగుదొడ్లకు వెళ్లేందుకు అనుమతించకుండా వేధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు మద్దతు పెరగడంతో, ప్రభుత్వం దిగి వచ్చింది. అంగన్‌వాడీ సంఘాల నాయకురాళ్లతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్‌ జయలక్ష్మీ ఆద్వర్యంలో చర్చలు జరిపారు. ఎట్టకేలకు అర్ధరాత్రి 11.30 గంటలకు అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో చర్చలు సఫలం కావడంతో దీక్షలు విరమించారు. విజయోత్సవ సభలు జరుపుకుంటూనే, అంగన్‌వాడీలు విధులకు హాజరవుతూ ఉద్యమాలకు ఆయువుపట్టుగా అంగన్‌వాడీలు నిలిచారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

➡️