ఎప్పటికందేనో…పరిహారంతుపాను బాధితుల నిరీక్షణ

ఎప్పటికందేనో...పరిహారంతుపాను బాధితుల నిరీక్షణ

ఎప్పటికందేనో…పరిహారంతుపాను బాధితుల నిరీక్షణప్రజాశక్తి-తిరుపతి సిటి మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో తూర్పు మండలాల్లో అధికభాగం నీటమునిగాయి. పంటపొలాలు, ఇళ్లు, రహదారులు, వంతెనలు అన్నీ నీటితో నిండిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది మంది బాధితులకు సాయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. అయినా అధికారులు ఇప్పటి వరకూ కనీసం వరదనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసిన పాపాన పోలేదు. ఇక నష్టపరిహారం ఎప్పటికి అందుతుందోనని బాధితులు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తు సిఎం పర్యటించే నాటికి పూర్తిస్థాయి నష్టం అంచనాలు ప్రకటించకపోవడం గమనార్హం. జిల్లాల విభజనతో తిరుపతి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో లేనిది ఈ జిల్లాకు సముద్ర తీరప్రాంతం కలిసొచ్చింది. నాలుగు రోజుల పాటు మించెన్‌ తుఫాన్‌ వల్ల జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి డివిజన్లలో వర్షం వల్ల నష్టం తీవ్రంగా ఉంది. తుఫాన్‌ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం, అధికారులు అప్రమత్తం అయ్యారు. హెల్ప్‌లైన్లు, సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. కానీ వర్షం ఆగిన తర్వాత బాధితులను ఆదుకోవడంలో పూర్తిస్థాయిలో చొరవ చూపలేదు. కనీసం ఇప్పటి వరకు వరద నష్టాన్ని అధికారులు అంచనా వేయకపోవడం శోచనీయం. ప్రాథమిక అంచనాలు కూడా లేకపోవడంతో బాధితులకు పరిహారం ఇవ్వడంలో అలసత్వం తప్పలేదు. సాక్షాత్తు సిఎం జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చి, వరద ప్రాంతాలను పర్యటించి, కొంత మంది బాధితులతో ముచ్చటించినా, పరిహారం ఇస్తాం, నష్టనివారణను పూడ్చుతాం. నిధులు విడుదల చేస్తాం అంటూ హామీలు ఇవ్వడం తప్పా, పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. తిరుపతి జిల్లాలో ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, పశుసంవర్ధక, మత్స్యశాఖల పరిధిలోనే సుమారు 600 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆర్‌డబ్య్లుఎస్‌ స్కీమ్‌లు, పిడబ్ల్యుఎస్‌ స్కీములు, ట్యాంకర్లు, 15 జనరేటర్లు, మరో 72 బోర్లు నీట మునిగాయి. వ్యవసాయశాఖకు సంబంధించి 34 మండలాల్లో 467 గ్రామాల్లో పంట నష్టం, 12568 హెక్టార్లో వరి, 460 హెక్టార్లో వేరుసెనగ, 987 హెక్టార్లలో కంది, ఉద్యానశాఖ పరిధిలో 250 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ శాఖలో జిల్లాలో 8 కోట్ల మేర నష్టం జరిగింది. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటపొల్లాల్లో ఇసుకమేటలు, అనేక వేల ఎకరాలు పంట నీటమునిగింది. అనేక కల్వర్లు, చెక్‌డ్యాములు, కొట్టుకుపోయాయి. వేలాది మంది బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసి, త్వరతగతిన పరిహారాన్ని అందించి, తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఆ దశగా అధికారులు చర్యలను ముమ్మరం చేయాల్సి ఉంది.

➡️