చెవిరెడ్డి చెప్పిందే మఠం అధికారులు చేశారు: బడి సుధాయాదవ్హథీరాంజీ మఠం వద్ద ఆందోళనప్రజాశక్తి-తిరుపతి(మంగళం):చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనల మేరకే మఠం అధికారులు పేదలు నిర్మించుకున్న ఇళ్లను కుల దోసారని, మఠం అధికారులు మఠంకు చెందిన 22 ఎకరాలు భూమిని చెవిరెడ్డి భార్య లక్ష్మీ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీటిపై మఠం అధికారులు ఎందుకు నోరు మెదపలేదని పుదీపట్ల గ్రామపంచాయతీ సర్పంచి బడి సుధా యాదవ్ మఠం అధికారులను ప్రశ్నించారు. బుధవారం తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజి మఠం వద్ద పేదలతో కలిసి మఠం ఫిట్ పర్సన్ కార్యాలయం ముందు బైఠాయించారు. పేదల జోలికి రావద్దని, చెవిరెడ్డి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుధా యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులు పేదలు కట్టుకున్న ఇళ్లను పథకం ప్రకారం కూల్చారని ఆరోపించారు. తుమ్మలగుంట మఠం భూములలో భారీ లావాదేవీలు జరిగాయని, మఠం భూముల ఆక్రమణను ప్రేరేపించింది, లావాదేవీలు నడిపించి కాసులు వెనకేసుకునింది ఎమ్మెల్యే కుటుంబమే అన్నారు. తక్కువ ధరకే ఫ్లాట్లు పేదల చేత కొనిపించి వారికి పన్నులు, విద్యుత్ మీటర్లకు సిఫారసు చేసింది ఎమ్మెల్యేనే అన్నారు. తుమ్మలగుంటలోని 100 ఎకరాల్లో ఉన్న చెరువును తన ఇష్టానుసారం భౌగోళిక మార్పులు చేసి తుడా నిధులు 150 కోట్లు వృధా చేశారన్నారు. దీనిపై మూడు రోజుల క్రితం ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటే, అధికారులు యధాతధంగా చెరువును చెరువుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్ష విరమించడం జరిగిందన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
