పెట్లూరు పేదలకు భూములు పంచాలిఎర్రజెండా పాతి సిపిఎం భూపోరాటంప్రజాశక్తి – వెంకటగిరి రూరల్ దశాబ్దకాలంగా పెట్లూరు పేదలకు భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నా, అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా కుంటిసాకులు చెబుతుండడంతో ఆగ్రహించిన పేదలు సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఎర్రజెండాలు నాటి భూపోరాటం ప్రారంభించారు. రెవెన్యూ పరిధిలోని 250 ఎకరాల భూమి పేదలకు భూములు పంచాలి అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో 150 మంది అర్హులైన పేదలు ఉన్నారని, అందరికీ రెండు ఎకరాల చొప్పున భూములు పంచాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ పరిధిలోని పెట్లూరు పంచాయతీ సర్వే నంబర్ 1లో 238 ఎకరాల 98 సెంట్లు, సర్వే నంబర్ 12లో 519 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇందులో 250 ఎకరాల్లో ఎర్రజెండాలు నాటారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డివిజన్ నాయకులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ గత పదేళ్లుగా ఆ భూముల్లోకి పేదలు వెళుతుంటే ఫారెస్టు వారు అడ్డుకుంటున్నారన్నారు. రికార్డుల ప్రకారం రెవెన్యూ మేత భూమిగా ఉన్నదాన్ని, ఫారెస్టు వారికి ఎటువంటి సంబంధం లేకపోయినా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఫారెస్టు వారిపైన చర్యలు తీసుకోవాలని, జాయింట్ సర్వే చేయాలని అనేక పర్యాయాలు వినతిపత్రాలు ఇచ్చినా చేస్తాం చూస్తాం అంటూ వనసంరక్షణ సమితులకు కేటాయించిన స్థలమని కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. వన సంరక్షణ సమితులకు కేటాయించి ఉంటే గత పదేళ్లలో ఒక్క చెట్టు కూడ నాటలేదని, పెట్లూరు గ్రామ పేదలు ఎవరూ లేకుండా వన సంరక్షణ సమితులు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. పెట్లూరు గ్రామ పేదలకు భూములు పంచేంత వరకూ ఈ భూపోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇదే సర్వే నంబర్లలో జగనన్న ఇళ్ల ప్లాట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వైసిపి ఇన్‌ఛార్జి రాంకుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూపోరాటంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పద్మమ్మ, రమణయ్య, గోపాలయ్య పాల్గొన్నారు.
