భూ దందా’ పై చర్యలు తీసుకోవాలికలెక్టర్, ఎస్పికి ఫిర్యాదు చేసిన భాదితులుప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తమ అనుభవంలో ఉన్న భూమిని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితులు చెంగయ్య, అశోక్ నాయక్ తెలిపారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతి అర్బన్ మండలం తిరుపతి టౌన్ సర్వే నెంబర్ 242/84లో గల ఎ.5.73 సెంట్లు భూమి శ్రీహథీ రాంజీ మఠం ద్వారా కౌలుకు తీసుకున్నామని, తమ అనుభవంలో ఉన్న సదరు భూమికి ప్రహరీ నిర్మించుకోవడంతోపాటు దక్షిణం వైపున సుమారు 35సెంట్లు భూమిని నిలుపుకున్నామని తెలిపారు. సదరు భూమి ఖాళీగా ఉందని గమనించిన కొందరు భూకబ్జాదారులు దానిని కబ్జా చేయడానికి యత్నించారని తెలిపారు. ఇది ఏమిటని ప్రశ్నించిన తమపై దాడి చేశారని, పైగా రాత్రికిరాత్రే బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆ భూమిలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఘటనపై ప్రజాసంఘాల నాయకులతో కలిసి సోమవారం పోలీసు అధికారులకు, కలెక్టర్, మున్సిపల్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసామన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని ఆక్రమణలు చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో ఎలాగైనా సరే ఆ నిందను తమపై వేయాలనే ఉద్దేశ్యంతో ఉదయానికల్లా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి, మేమే తొలగించామని ప్రచారం చేసి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించామని తమపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వీరి వలన తమకు ప్రాణహాని ఉందన్నారు. లలితమ్మ, శశికళ, కష్ణవేణి, సుగుణమ్మ పాల్గొన్నారు.
