మఠం భూముల ఆక్రమణలో…అసలు సూత్రధారి ఎవరు..?కబ్జాలపర్వంలో పేదలే సమిథలుప్రజాశక్తి-తిరుపతి(మంగళం)దేశవ్యాప్తంగా ఏ మఠానికీ లేనన్ని భూములు శ్రీ స్వామి హథీరాంజీ మఠానికి మాత్రమే ఉన్నాయి. దశాబ్దాలుగా మఠానికి చెందిన భూములపై రాజకీయ నాయకుల పెత్తనం పెరుగుతుండడంతో మఠానికి చెందిన భూములు క్రమేపి అన్యాక్రాంతమవుతూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. అర్జున్ దాస్ మహంతుగా బాధ్యతలు తీసుకోక ముందు హథీరాంజీ మఠం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండేది. హాథీరాంజీ మఠం భూములు రాజకీయ నాయకులు అన్యాక్రాంతం చేస్తున్నారని అర్జున్ దాస్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్యాక్రాంతం వాస్తవమేనని తేల్చిన కోర్టు అర్జున్ దాస్ ను మఠానికి మహుంతుగా నియమిస్తూ మఠం పాలన వ్యవహారాలతో పాటు, మఠం ద్వారా జరిగే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేలా అధికారాలు ఇవ్వాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. మఠం భూముల్లో రాజకీయ జోక్యంఅర్జున్ దాస్ మహంతుగా పదవీ బాధ్యతలు చేపట్టాక అన్యాక్రాంతమైన ఒకటి, రెండు మఠం భూములను స్వాధీనం చేసుకోవడంతో రాజకీయ జోక్యాలు మొదలయ్యాయి. ఆనాటి నుండి మఠం మహంతుగా అర్జున్ దాస్ రాజకీయ జోక్యాలకు తలొగ్గి అక్రమార్జనకు పెట్టుబడిగా మార్చేసుకున్నారు. ఈ క్రమంలో మఠం భూములు వ్యవసాయ వినియోగానికి లీజు ప్రతిపాదికన కేటాయింపులు చేయించుకొని, దానిపై కోర్టుల్లో పిల్ వేసి ఎలాగైనా లీజు ద్వారా పొందిన మఠం భూమిని సొంతం చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. మఠం భూములను లీజుకు పొందిన వారు సకాలంలో లీజు నగదును చెల్లించక మఠం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ వచ్చారు. భూముల ఆక్రమణ వెనుక ఉన్నదెవరు..?తుమ్మలగుంట మఠం భూముల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో చోటా మోటా నాయకులు ల్యాండ్ మాఫియాగా ఏర్పడి లక్షల రూపాయల వరకు ఒక్కో ఫ్లాటు అమ్మారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు బుధవారం తెల్లవారుజామున తొలగించిన ఇళ్ల వద్ద వారిని మీకు ఈ స్థలం ఎవరు అమ్మారు?… మీరు కొన్న డాక్యుమెంటు మాకు అందిస్తే మేము వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎవరూ స్పందించలేదని మీడియాతో చెప్పారు.అధికారపార్టీ నాయకుల జోలికి వెళ్లరే…..తుమ్మలగుంటలో అధికార పార్టీ నాయకులు ఐదు సెంట్లు నుంచి ఆరు సెంట్లుపైగా స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మిస్తున్నారని, మఠం అధికారులు వాటి జోలికి ఎందుకు వెళ్లరని ప్రతిపక్ష టిడిపి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇదే క్రమంలో పుదిపట్ల సర్పంచి బడి సుధా యాదవ్ కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పేరిట హాథీరాంజీ మఠం భూమి రిజిస్ట్రేషన్ అయ్యి ఉందని, సదరు మఠం స్థలంలో అధికారులు మఠంకు చెందిన భూమిగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దిక్కుతోచని స్థితిలో పేదలు…..బుధవారం తుమ్మలగుంటలో జరిగిన కూల్చివేతల్లో అంతో ఇంతో సొమ్ము పెట్టుకుని కొనుక్కున్న స్థలాలలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు జెసిబి యంత్రాల సహాయంతో కూల్చివేయడంతో పేదలు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు అధికార వైసీపీలోనే కొందరు తమది కూడా కొట్టేసారంటూ మోహిత్ రెడ్డి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలు ఆడినట్టుగా సమాచారం. మోహిత్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. మీకు తెలియకుండా అధికారులు వస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. టిడిపి పార్టీకి చెందిన వారు కూడా ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై మఠం స్థలాన్ని కొనుక్కోవద్దని మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు పదే పదే చెబుతున్నా పట్టించుకోకపోవడం తోనే ఇంత నష్టం వాటిల్లుతోందని మఠం సిబ్బంది చెబుతున్నారు. అంతిమంగా నష్టపోయింది మాత్రం పేదలే.పేదలకు జగనన్న ఇంటి పట్టాలు రాలేదా…..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాల పథకంలో భాగంగా పేదలందరికీ ఇంటి స్థలాలు పథకం అమలు చేస్తోంది. ఎమ్మెల్యే స్వగ్రామమైన తుమ్మలగుంటలో పేదలంటూ ఇల్లు నిర్మించుకున్నామని చెబుతున్న వారికి ఇక్కడి అధికార పార్టీ నాయకులు జగనన్న ఇంటి పట్టాలు వచ్చేలా చర్యలు తీసుకోలేదా?…. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న మఠం భూములను అడ్డాగా చేసుకొని తక్కువ ధరకు పేదలంటూ చెబుతున్న వారికి అమ్మేసారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ మఠం భూముల్లో ప్రస్తుతం ఇల్లు కూల్చిన ప్రదేశంలో మళ్ళీ కట్టడాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పేదల ముసుగులో అధికార పార్టీకి చెందినవారు ప్రభుత్వ సెలవు దినాల్లో ఎడాపెడా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
