మళ్లీ ధర పెరిగిన ఉల్లి కూరగాయల ధరలకు రెక్కలు రోజురోజుకి పైపైకీ…పెళ్లిళ్లు, ఫంక్షన్ల పై ప్రభావంప్రజాశక్తి- తిరుపతి టౌన్:ఉల్లిపాయల ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఉల్లి ధరలు కాస్త తగ్గినట్టు కనిపించినా.. అది ఎంతోకాలం నిలవలేదు. మహారాష్ట్ర నుంచి కొత్త ఉల్లిపాయలు ఒకేసారి మార్కెట్లను ముంచెత్తడం, వివిధ రకాల నాణ్యతలు కలిగిన ఉల్లిపాయలు అందుబాటులోకి రావడంతో సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు తమకు నచ్చిన క్వాలిటీని ఎంపిక చేసుకునేవారు. ఆటోల్లో ఇళ్ల దగ్గరకు తెచ్చి మరీ ఏడు కిలోలు రూ.100కు కూడా విక్రయించారు. ఇక రైతు బజార్లు, బహిరంగ చిల్లర మార్కెట్లలోనూ ధర కాస్త తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం ఎత్తివేయడంతో మహారాష్ట్ర నుంచి ఇతర దేశాలకు భారీగా ఎగుమతులు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లోకి ఉల్లిలోడులు తక్కువగా వస్తున్నాయని, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. మరోపక్క కూరగాయల ధరల్లోనూ పెరుగుతూనే ఉన్నాయి. మాఘమాసంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్దసంఖ్యలో జరుగుతుండడంతో కూరగాయల వినియోగం భారీగా పెరిగింది. దీంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. అలాగే ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పుల ప్రభావం కూరగాయల దిగుబడులపై పడుతోంది. దీంతో కూరగాయల ధరల్లో కొంత పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా గతవారం రోజులుగా ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. హోల్ సేల్ మార్కెట్లో మంచి నాణ్యత కల్గిన ఉల్లిపాయలు కిలో రూ.26 నుంచి రూ.28 ధర ఉంది. ఇదే రకాన్ని బహిరంగ మార్కెట్లో రిటైల్ వ్యాపారులు రూ.30 నుంచి రూ.35ల వరకూ విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో మొన్నటివరకూ కిలో రూ.20లు ఉండగా ఇప్పుడు రూ.24లకు చేరింది. ఆటోల్లో ఇళ్ల దగ్గరకే తెచ్చి విక్రయించేవారు కూడా (చిన్న ఉల్లిపాయలు) రూ.100లకు ఐదు కిలోలు మించి ఇవ్వడం లేదు. క్వాలిటీ తక్కువగా ఉండే రకాలు మార్కెట్లోకి రాకపోవడం, మంచి రకాలు, నిల్వలు ఎక్కువ రేటులో ఉండడంతో వీధుల్లో విక్రయించే చిల్లర వ్యాపారులు ఉల్లిపాయల జోలికి వెళ్లడం లేదు.కూరగాయలదీ అదే దారి…ఉల్లిపాయల బాటలోనే కూరగాయల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క టమోటా మినహా మిగిలిన అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి. బహిరంగ చిల్లర మార్కెట్లో వంకాయలు కిలో రూ.80 వరకూ అమ్ముతున్నారు. బెండకాయలు రూ.50, పచ్చిమిర్చి రూ.60, కాకరకాయలు రూ.50, బీరకాయలు రూ.40, చిక్కుళ్లు రూ.80 వరకూ అమ్ముతున్నారు. రైతుబజార్లలో ధరలు పరిశీలిస్తే వంకాయలు కిలో రూ.54, గులాబీ రకం రూ.44, తెలుపు రూ.38 ఉంది. రెండు వారాల వ్యవధిలోనే కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకూ ధరలు పెరిగాయి. కాలీఫ్లవర్ రూ.25లకు విక్రయిస్తున్నారు. ఇది రూ.12 నుంచి 15లకు దొరికేది. బెండకాయలు రూ.32, పచ్చిమిర్చి రూ.34, కాకరకాయలు రూ.38, చిక్కుళ్లు రూ.54, చేమదుంపలు రూ.50, బీన్స్ రూ.60, సొరకాయ రూ.16.. ఇలా అన్ని రకాల కూరగాయల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. రైతుబజార్లతో పోల్చితే బహిరంగ మార్కెట్లలో ధరలు మరింత ఎక్కువగానే ఉంటాయి.ధరలు మరింత పెరిగే అవకాశం… తిరుపతి ఇంద్రిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌కు తమిళనాడు, కర్ణాటక, కర్నూలు, ఒంగోలు నుంచి కూరగాయల లారీలు రోజుకి 30పైగా వస్తాయి. రాబోయే రోజుల్లో ఉల్లిపాయలు, కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులపై మళ్లీ నిషేధం విధించినా ఉల్లిపాయల ధరలు ఇప్పట్లో తగ్గకపోవచ్చనే అంచనా వేస్తున్నారు. ఉల్లిపాయలు పాతబడితే వాటి నాణ్యత పెరుగుతుంది. నిల్వకు ఆగుతాయి. ఇలాంటి రకాలన్నీ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు. మంచి రేటు వచ్చాక బయటకు తీస్తారు. ఎగుమతులపై నిషేధం లేకపోతే క్వాలిటీ ఉల్లిపాయలను మంచిరేటుకు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారని, దేశీయ మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. అలాగే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ఆ ప్రభావం కూరగాయల సాగుపై పడుతుంది. దిగుబడులు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకురావాల్సి ఉంటుంది. ఫలితంగా ధరలు మరింత పెరుగుతాయని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. అటు ఉల్లిపాయలు ఇటు కూరగాయలు పెరుగుదల సామాన్యులపై ప్రభావం పడనుంది.
మళ్లీ ధర పెరిగిన ఉల్లి కూరగాయల ధరలకు రెక్కలు రోజురోజుకి పైపైకీ…పెళ్లిళ్లు, ఫంక్షన్ల పై ప్రభావం
