లింగోద్బవం… గందరగోళం- ప్రముఖులకే మొదటి ప్రాధాన్యత- సామాన్య భక్తుల తిరుగుబాటుప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన ఎంతో పవిత్రంగా భావించే లింగోద్భవం ఎన్నడూ లేని విధంగా గందరగోళంగా మారింది. శనివారం వేకువ జామున నిర్వహించిన లింగోద్భవ దర్శనం విషయంలో ఆలయ అధికారులు ప్రముఖులకు ప్రాధాన్యత ఇచ్చారు. లింగోద్బవ వేళ సామాన్య భక్తులు ఎవరూ ఆలయం లోపలకు రాకుండా ప్రవేశ ద్వారం మూసేశారు. సామాన్య భక్తులు ప్రవేశ ద్వారం వద్ద సుమారు గంట పాటు వేచి ఉండాల్సి వచ్చింది. సహనం కోల్పోయిన భక్తులు ఆలయ అధికారులపై తిరుగుబాటు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద ‘ఈవో డౌన్ డౌన్’… ‘ఈవో వెంటనే బయటకు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేయడంతో చేసేది లేక అధికారుల సూచనల మేరకు ఆలయ సిబ్బంది ప్రవేశ ద్వారాలు తెరిచారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన అర్థరాత్రి తరువాత నిర్వహించే లింగోద్భవం కార్యక్రమాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. లింగోద్భవ వేళ పరమశివుని దర్శించుకోవడం కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ యేడాది కూడా లింగోద్భవ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి నంది వాహనంపై పుర విహారం చేసి ఆలయం లోపలకు వచ్చే సరికి వేకువ జాము మూడు గంటలు దాటింది. స్వామి వారితో పాటు కొంతమంది ప్రజాప్రతినిధులు, ప్రముఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు లోపలకు వెళ్లారు. వారు లోపలకు వెళ్లిన వెంటనే ఆలయ ప్రవేశ ద్వారాలు మూసేశారు. ఆ తరువాత లింగోద్భవం… ఆలయ శుద్ది, గోపూజ, అభిషేకం నిర్వహించారు. ఈ పూజలన్నీ ప్రముఖుల సమక్షంలోనే చేశారు. ప్రముఖులందరికీ లింగోద్భవ దర్శనం అయ్యే వరకు సామాన్య భక్తులను ఎవరినీ అనుమతించలేదు. సామాన్య భక్తులు గంటకు పైగా ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పసి పిల్లల తల్లులు తమ బిడ్డలను నేలపైనే పడుకోబెట్టి దర్శనం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. గంటకు పైగా ప్రవేశ ద్వారాలు మూసేయడంతో సామాన్య భక్తులకు ఆగ్రహం తెప్పించింది. వారు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మకర్తల మండలి తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను వారించడానికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. దీంతో వారు కూడా మిన్నకుండి పోయారు. లింగోద్భవం వేళ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ అధికారులు వ్యవహరించారని సామాన్య భక్తులు మండిపడ్డారు. ప్రముఖులకు మాత్రం అంతరాలయం దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు, సామాన్య భక్తులకు మాత్రం మహాలఘు దర్శనం నిబంధన పెట్టి స్వామి వారిని తనివి తీరా చూసే భాగ్యం లేకుండా చేశారు. అంతేగాకుండా భక్తులందరినీ ఒకేసారి ఆలయం లోపలకు అనుమతించడంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ కారణంగా సామాన్య భక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొంతమంది ప్రజా ప్రతినిధులు, ధర్మకర్తల మండలి తీరు కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని సామాన్య భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయ ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.