శివరాత్రి ఉత్సవాలకు వేళాయే..నేటి నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈనెల 3వ తేదీ ఆదివారం నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానునున్నాయి. 3న భక్తకన్నప్ప ధ్వజారోహణం, 4న శ్రీకాళహస్తీశ్వరస్వామి ధ్వజారోహణం, 5న 2వ తిరునాళ్లు, 6న మూడవ తిరునాళ్లు, 7న నాలుగవ తిరునాళ్లు, 8న మహాశివరాత్రి, 9న ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 10న ఆదిదంపతుల కల్యాణం, 11న సభాపతి కల్యాణం, 12న కైలాసగిరి ప్రదక్షిణ, 13న ధ్వజావరోహణం, 14న పల్లకీసేవ, 15న ఏకాంతసేవ, 16న శాంతి అభిషేకం నిర్వహించనున్నారు. ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే తిరుపతి కలెక్టరు డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ కోసం రాజగోపురం వెనుక వైపున కళాప్రాంగణం సిద్ధమైంది. స్వామి అమ్మవార్ల సేవలకు ఆలయ అధికారులు వాహనాలు సిద్ధం చేశారు. ప్రధాన అర్చకులకు బంగారు ఆభరణాలు అప్పగింతశ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి అలంకరించడానికి అవసరమైన బంగారు ఆభరణాలను శనివారం ఆలయ ప్రధాన అర్చకులకు అప్పగించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ బ్యాంకులోని లాకర్లలో ఉంచిన ఆ బంగారు ఆభరణాలను అధికారులు పరిశీలించి ప్రధాన అర్చకులకు అందజేశారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు ఈ ఆభరణాలను స్వామిఅమ్మవార్లకు అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వీ నాగేశ్వరావు, సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, పర్యవేక్షకులు కళ్యాణి, అకౌంటెంట్ యుగంధర్, అప్రైజర్ రవిచంద్ర, అలంకార గురుకుల్ రాజేష్, సూరి పాల్గొన్నారు.
