‘శ్రామిక’ పక్షపాతి సురేంద్రరెడ్డిప్రజాశక్తి-తిరుపతి సిటి తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్ ఉద్యోగుల, కార్మికుల సమస్యల సాధన కోసం మూడు దశాబ్దాలుగా నిరంతరం పోరాటాలు సాగిస్తున్న అలుపెరగని శ్రామికుడు, కార్మిక నాయకుడు, దక్షిణ భారతదేశంలోనే రైల్వే మజ్దూర్ యూనియన్‌లో తనకంటూ ఒక ప్రత్యేక నాయకత్వాన్ని చాటుకున్న వ్యక్తి మోడీగుంట సురేంద్ర రెడ్డి. ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన ‘ప్రజాశక్తి’తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పింఛన్ విధానాన్ని రద్దుచేసి, పాత పింఛను విధానాన్ని అమలులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ శంకర్రావు నాయకత్వాన్ని స్ఫూర్తిగా ఎంచుకుని సిఆర్‌ఎస్ మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ తరపున అనేక పోరాటాలు నడిపించానని తెలిపారు. నూతన పింఛను విధానం వల్ల కార్మిక సోదరులకు భవిష్యత్తులో వచ్చే నష్టాన్ని కళ్ళకు కట్టినట్టు ఎగ్జిబిషన్ ద్వారా వివరించానన్నారు. తిరుపతి రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్‌లో ఉద్యోగులు కార్మికుల పక్షాన 38 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సమ్మెలు, ధర్నాలు, గేట్ మీటింగ్లు నిర్వహించి ఓటమి ఎరుగని నాయకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిల పరచుకొని, అందరి మన్ననలను పొందడం ఆనందంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వెంకటాపురంలో మోడీగుంట దొరస్వామి రెడ్డి, నారాయణమ్మలకు ఐదో సంతానంగా సురేంద్ర రెడ్డి మే 10, 1964లో జన్మించారు. ప్రాథమిక విద్య పోలవరంలో, పదో తరగతి వరకూ పూతలపట్టులో, ఇంటర్ పాకాలలో, డిగ్రీ చిత్తూరు పివికెఎన్‌లో పూర్తి చేశారు. అన్నామలై యూనివర్సిటీలో బిఇడి చేసిన ఆయన సాంకేతిక విద్యవైపు దృష్టి సారించారు. తిరుపతిలో ఐటిఐ చేసి సెంటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపక వత్తిని నిర్వహించారు. 1987లో తిరుపతి రైల్వే క్యారేజీ రిపేర్ షాప్‌లో రైల్వే ఉద్యోగంలో చేరారు. 1991 సంవత్సరంలో తిరుపతికి చెందిన మంజులతో వివాహమైంది. వారికి హిమబిందు, సింధు ఇద్దరు కుమార్తెలు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్‌లో 2019నుంచి 2024 వరకు జోనల్ సెక్రటరీగా , వర్క్ షాప్స్ డివిజనల్ సెక్రెటరీగా తన 38 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏటా స్పోర్ట్స్‌మీట్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
