‘హద్దులు’ మీరి ‘నిర్మాణాలు’యథేచ్ఛగా కాల్వ పోరంబోకు కబ్జా2019లో వేసిన హద్దులు బేఖాతర్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)పట్టా భూమి పక్కనే కాల్వ పోరంబోకు స్థలం.. దాన్ని ఎంచక్కా కలుపుకుంటే ఆస్తి కలిసొస్తుందని కబ్జాదారులు నెమ్మదిగా కాల్వ పోరంబోకు స్థలంపై గ్రావెల్ తోలి భౌగోళిక స్వరూపాన్నే క్రమేపీ మార్చేస్తూ వచ్చారు.ఈ తంతు తెలిసిన అర్బన్ రెవెన్యూ అధికారులు 2019, డిసెంబర్ 22న పట్టా భూమిని, ప్రభుత్వ భూమిని వేరు చేస్తూ పొడవాటి కందకాన్ని తవ్వి హద్దు లేర్పరిచారు. అయితే ఆ భూమి మళ్లీ కబ్జాకు గురవుతోంది. తిరుపతి అర్బన్ మండలం ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 118లో దాదాపు రెండు ఎకరాల కాల్వ పోరంబోకు భూమి ఉంది. దీన్ని ఆనుకుని సర్వే నంబర్ 116లో ప్రైవేట్ వ్యక్తికి చెందిన పట్టా భూమి ఉంది. నాడు రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పరచిన ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా నేడు అక్రమ నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అయినా ఇప్పటి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే భూమిలో…సర్వేనెంబర్ 118 లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తుండడంతో అప్పట్లో దినపత్రికలలో కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని ప్రభుత్వ భూమిగా సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. కొన్ని నెలల పాటు అలానే ఉన్న ప్రభుత్వ సూచిక బోర్డు నేడు మాయమైపోయింది. నేడు గుట్టు చప్పుడు కాకుండా ప్రధాన మార్గం నుండి స్థలంకు లోపల గల ముళ్ళ చెట్లను తొలగించి గది నిర్మాణాలు పూర్తిచేసి రంగులు కూడా వేసేశారు. నిర్మించిన గది వెనుక భాగాన వెళుతున్న కాలువపై కప్పులను నిర్మిస్తున్నారని సమాచారం. దశాబ్దాల పాటు మంగళం శెట్టిపల్లి రోడ్డు మార్గం సరిగా లేకపోయినా భూమి విలువ కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం టీటీడీ సహకారంతో మంగళం-శెట్టిపల్లి మార్గాన్ని కలుపుతూ 80 అడుగుల రోడ్డు మార్గం నిర్మాణానికి మార్గం సుగమమయ్యింది. ఈ నేపథ్యంలో కబ్జా దారుల కన్ను మళ్లీ సర్వే నంబర్ 118 పై పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల విధుల్లో తలమునకలు అవడంతో కబ్జాదారులు భారీ పథకాన్ని రచించారు. ఈ కబ్జా తంతుపై అర్బన్ రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
‘హద్దులు’ మీరి ‘నిర్మాణాలు’యథేచ్ఛగా కాల్వ పోరంబోకు కబ్జా2019లో వేసిన హద్దులు బేఖాతర్
