నానిపై హత్యాయత్నం కేసులో…13 మంది అరెస్టు కడప సబ్‌జైలుకు తరలింపు

నానిపై హత్యాయత్నం కేసులో…13 మంది అరెస్టు కడప సబ్‌జైలుకు తరలింపుప్రజాశక్తి -తిరుపతి సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మందిని అదుపులో తీసుకొని, కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ కష్ణ కాంత్‌ పటేల్‌ తెలిపారు. గురువారం అయిన కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తూ… స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎం బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీసమేతంగా స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించేందుకు మహిళా యూనివర్సిటీ కి వచ్చారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మెయిన్‌ గేటు వద్ద భాను కుమార్‌ రెడ్డి, గణపతి రెడ్డి వారి అనుచరులు ముదిపల్లి జానకి రెడ్డి, జానయ్య గారి జయ చంద్రారెడ్డి, పొదలకూరు కోదండమ్‌, బొక్కసం చిరంజీవి, దండు పుష్పకాంత్‌ రెడ్డి, ఎద్దల భాస్కర్‌ రెడ్డి, కామసాని సాంబ శివ రెడ్డి, అప్పన్నగిరి సుధాకర్‌ రెడ్డి, పి హరికష్ణ, పసుపులేటి రాము, గోగుల కోటయ్యలు పులివర్తి నానిని అడ్డగించి వారిపై సమ్మెట, రాడ్లు, క్రికెట్‌ బ్యాట్లు, రాళ్లు, బీర్‌ బాటిళ్లు వంటి వాటితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిని పులివర్తి నాని గన్మెన్‌ ధరణి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతనిపై కూడా సమ్మెటతో తీవ్రంగా దాడి చేశారు, రక్త గాయాలైన అతను తన ప్రాణ రక్షణ కోసం గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో భాను కుమార్‌ రెడ్డి, గణపతి రెడ్డి వారి అనుచరులు ఘటనా స్థలం నుండి పారిపోయారని తెలిపారు. ఈ కేసును సవాలు తీసుకున్న జిల్లా పోలీసులు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి విస్తతంగా గాలింపు చేపట్టారన్నారు. పోలీసులకు చెందిన కచ్చితమైన సమాచారం మేరకు గురువారం నిందితులు 13 మందిని అదుపులో తీసుకున్నామని వెల్లడించారు. ఈ కేసులను 24 గంటల లోపే ఛేదించిన తిరుపతి డిఎస్పి సురేంద్ర రెడ్డి, సిసిఎస్‌ డిఎస్పి రవికుమార్‌ ఎస్వీయూ క్యాంపస్‌ సిఐ మురళీమోహన్‌ రావు, ఎస్‌ఐ రామాంజనేయులు, అంజనప్ప, ఐడి పార్టీ సిబ్బంది ఏఎస్‌ఐ దామోదర్‌, మోహన్‌ బాబు, ఈశ్వర్‌, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, రివార్డులను ప్రకటించారు.

➡️