కూటమికే కిక్కు!దరఖాస్తులతో రూ.78.40 ఆదాయంతెల్లారకముందే కిక్కిరిసిన శిల్పారామంసబ్‌లీజ్‌లు కోట్లల్లోనే బేరసారాలుటిడిపి కూటమి మద్యం షాపుల కేటాయింపుల్లో సిండికేట్ అయ్యింది. టిడిపి, జనసేన, బిజెపి పార్టీలకు అనుకూలంగా ఉన్న వైసిపి వారికీ కొన్నిచోట్ల బ్రాందీషాపులు దక్కాయి. దరఖాస్తు చేసుకున్నపుడే ఒప్పందాలు జరిగిపోయాయి. జిల్లాలో 227 మద్యం షాపులకు 3,920 మంది దరఖాస్తు చేసుకున్నారు. 78.40 కోట్లు ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. 2014-2019 మధ్యలో అప్పటి చంద్రబాబు హయాంలో మద్యం టెండర్లు పిలవగా ఒక్కో షాపుకు 100-150 వరకూ దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 184 షాపులు ఉండేవి. అప్పట్లో 6,150మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి లెక్కల ప్రకారం లక్ష రూపాయలు డిపాజిట్. ఈ లెక్కన సిండికేట్ అవడం వల్ల ఈ నూతన మద్యం పాలసీలో ఖజానాకు భారీగానే గండిపడిందని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం షాపులు దక్కని నిరాశావాహులు సబ్‌లీజ్‌ల కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం. ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో , తిరుపతి సిటీతిరుపతి జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 227 మద్యం దుకాణాలకు 3920 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం దరఖాస్తుల ద్వారానే జిల్లా ఎక్సైజ్ శాఖకు 78.40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, పుత్తూరు, నాగలాపురం, చంద్రగిరి ఎక్సైజ్ స్టేషన్లకు సంబంధించి, రెండో నెంబర్ హాల్లో గూడూరు డివిజన్‌కు సంబంధించిన గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వాకాడ, వెంకటగిరి సంబంధించి తిరుపతి- తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వద్ద జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో సోమవారం ఉదయం టెండర్లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 227 మంది మద్యం షాప్‌లను టెండర్ల ద్వారా దక్కించుకున్నారు. ఇందులో 64 మద్యం దుకాణాలకు ఒక్కో షాపుకు 55 లక్షల లైసెన్సు ఫీజు, 163 మద్యం దుకాణాలు 65 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే దరఖాస్తుదారులు ఉదయం 6 గంటలకే శిల్పారామం చేరుకోవాలని జిల్లా అధికారులు ఆదేశించడంతో వేకువ జామున నాలుగు గంటలకే శిల్పారామం ప్రాంగణంలో హడావిడి ప్రారంభమైంది. వేలాది మంది దరఖాస్తుదారులతో హాలు మొత్తం కిక్కిరిసింది. సరిగ్గా ఉదయం 7గంటల ప్రాంతంలో లాటరీ ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు. ఒక్కో షాపుకి మొదట, రెండు, మూడవ ప్రాధాన్యత ప్రకారం లాటరీ నెంబర్లను ఎంపిక చేశారు. మొదట ప్రాధాన్యత గల వ్యక్తులు నిర్ణీత సమయంలో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించకపోతే రెండో ప్రాధాన్యత వ్యక్తికి లైసెన్చును ఇవ్వనున్నారు. లాటరీ ద్వారా టెండర్లు దక్కించుకున్న వ్యక్తులు ఆనందంతో కేరింతలు కొట్టగా, టెండర్లు కోల్పోయిన వ్యక్తులు బాధతో వెనుతిరిగారు. మరి కొంతమంది ఆశావాహులు టెండర్లు దక్కించుకున్న వారి వద్ద నుంచి సబ్‌లీజ్ తీసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుపతి డివిజన్ పరిధిలో ఓ వ్యక్తి అత్యధికంగా 100 దరఖాస్తులు చేయగా అతనికి కేవలం ఐదు షాపులు మాత్రమే దక్కాయి. మరో వ్యక్తి కేవలం నాలుగు దరఖాస్తు చేయగా ఆ నాలుగు దరఖాస్తులకు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో కొంతమంది కూటమిగా ఏర్పడి 318 దరఖాస్తులు చేయగా కేవలం ఏడు షాపులు మాత్రమే దక్కించుకున్నారు. మరో మద్యం వ్యాపారి 60 దరఖాస్తులు చేయగా ఒక్క షాపు మాత్రమే దక్కింది. ఇంకో మద్యం వ్యాపారి తిరపతి అర్బన్ లో 90 దరఖాస్తులు, తిరుపతి రూరల్ లో ఆరు దరఖాస్తులు, శ్రీకాళహస్తిలో నాలుగు దరఖాస్తులు చేయగా తిరుపతిలో రెండు, తిరుపతి రూరల్ లో ఒకటి, శ్రీకాళహస్తి డివిజన్లో ఒకటి దక్కాయి. తిరుపతి చెందిన నలుగురు మిత్రులు కలిసి 36 దరఖాస్తులు చేయగా వారికి ఒకే ఒక్క షాపు దక్కింది. మరో మద్యం వ్యాపారి 35 దరఖాస్తులు చేయగా రెండుసార్లు దక్కించుకున్నారు. కేవలం మద్యం వ్యాపారమే ప్రధాన ఆదయంగా వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యాపారులకు టెండర్లు దక్కకపోవడంతో టెండర్లు దక్కించుకున్న వారి వద్ద సబ్ లీజులు కోసం ప్రాంగణంలోనే పోటీపడ్డారు. ఇది మంచి సమయముగా భావించిన లబ్ధిదారుడు ఒక్కో షాపుకు కోటి రూపాయలు బేరం పెట్టడం కోస మెరుపు.బ్రాందీషాపు పక్కనే పాకలు బ్రాందీషాపు పక్కనే పాకలు వెలుస్తున్నాయి. రౌండ్‌రౌండ్ టేబుళ్లు వెలిసాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ షాపులు ఉంటాయని అధికారికంగా ప్రభుత్వం చెప్పింది. లక్కిడిప్‌లో షాపులు దక్కించుకున్నవారు కూల్‌డ్రింక్స్, గ్లాసులు, వాటర్‌బాటిళ్లు, మటన్, చికెన్, ఎగ్ ఆమ్లెట్లు తదితర వస్తువులు పెట్టుకునేవారితో రాయబారాలు కుదుర్చుకుంటున్నారు. షాప్‌కు సైడ్ ఐటమ్స్, షాపు బాడుగ, సిబ్బంది జీతభత్యాలు వీరే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రాందీషాపు దక్కించుకున్న వ్యక్తికి ఆదాయం తప్ప ఖర్చేమీ లేదన్నమాట. మంగళ, బుధవారాల్లో డాక్యుమెంట్‌రైటర్ల వద్ద అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రాందీషాపులు ఎవరెవరికి వస్తాయో ముందే తెలుసుకున్న కూటమి నేతలు తిరుపతి రూరల్‌లో 12 మద్యం షాపులకు గాను రామాపురం, రామచంద్రాపురం, అవిలాల, కాలూరు ప్రాంతాల్లో షెడ్లు వెలిసాయి. అత్యంత పారదర్శకంగా ఓపెన్ టెండర్ల ప్రక్రియ నడిచిందని కలెక్టర్ చెబుతున్నా, అధికార పార్టీ ఎంఎల్‌ఎల కనుసన్నల్లోనే ఈ ఓపెన్ టెండర్ల ప్రక్రియ నడిచిందని చర్చ నడుస్తోంది. పారదర్శకంగా మద్యం టెండర్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వర రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జెసి వారి సహకారంతో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను చక్కగా పూర్తి చేశారన్నారు. మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకు సుమారు 78.40 కోట్లు రూపాయల రెవెన్యూ సమకూరిందని తెలిపారు. మద్యం దుకాణాలు ఈనెల 16 నుండి ప్రారంభించాలని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మద్యం దుకాణాల లైసెన్స్ 2024 నుండి 2026, సెప్టెంబర్ 30 వరకూ చెల్లుబాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాసుదేవ చౌదరి, ఊహా శ్రీ పాల్గొన్నారు.
కూటమికే కిక్కు!దరఖాస్తులతో రూ.78.40 ఆదాయంతెల్లారకముందే కిక్కిరిసిన శిల్పారామంసబ్‌లీజ్‌లు కోట్లల్లోనే బేరసారాలు
