- అదానికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం!
- వచ్చే ఏడాది మార్చిలోపు ప్రక్రియ పూర్తి?
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తిరుపతి విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది మార్చిలోపు ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత పరిణామాలను బట్టి చూస్తే ఈ ఎయిర్‌పోర్టుకు అదానికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. దీంతో, ప్రత్యక్షంగా వెయ్యి మంది, పరోక్షంగా 500 మంది ఉద్యోగ భద్రత కోల్పోనున్నారు. తిరుమలకు దేశ, విదేశాల నుంచి యాత్రికులు వస్తున్నారు. వీరి కోసం 1971లో ఈ విమానాశ్రయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 1993లో కొత్త టెర్మినల్, రన్‌వే పనులను అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రారంభించారు. 1999లో అప్‌గ్రేడ్ అయ్యింది. 2017లో అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు లభించింది. దేశంలోని 13 విమానాశ్రయాలను 2026 మార్చికల్లా ప్రైవేట్‌కు అప్పగించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రంగం సిద్ధం చేసింది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఇప్పటికే గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు సమాచారం.. మొత్తం 772 ఎకరాల్లో విస్తరించి ఉన్న తిరుపతి ఎయిర్‌పోర్టు కూడా ఇందులో ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లోనూ 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా పది లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో తిరుపతి, భువనేశ్వర్‌లోని విమానాశ్రయాలను ప్రైవేట్‌కు అప్పగించనున్నారు. అనంతరం ఔరంగబాద్, రాయపూర్, గయా, ఖుషినగర్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌కు ఇచ్చేయనున్నారు.
పథకం ప్రకారం తొలి నుంచి నిర్వీర్యం
పేరుకే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం. డైరెక్టర్ స్థాయి ఉన్న ఈ ఎయిర్‌పోర్టుకు ఆ క్యాడర్‌ను తగ్గించి మేనేజర్ స్థాయి క్యాడర్‌తో సరిపెట్టేశారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విదేశాలకు ఇక్కడి నుంచే విమానాలు వెళతాయని, శ్రీవారి చెంత దేదీప్యమానంగా తిరుపతి విమానాశ్రయం విరాజిల్లుతుందని, ఇక విదేశాలకు విమానాలే విమానాలు అంటూ ఊదరగొట్టారు. అయితే, ఇప్పటికీ నేరుగా ఇక్కడి నుంచి విదేశాలకు ఒక్క విమానమూ వెళ్లడం లేదు.
అభివృద్ధి చేసి… బంగారం పల్లెంలో పెట్టి…
ఈ విమానాశ్రయాన్ని 2022లో అదానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. టెర్మినల్, రన్‌వే, ఇతరత్రా అభివృద్ధి పనులు పెండింగ్ ఉండడంతో అమ్మకం వాయిదా వేసింది. 2,300 మీటర్ల రన్‌వే గతంలో ఉండేది. మూడు ఎకరాల్లో గరుడ టెర్మినల్ ఉండేది. ప్రస్తుతం ఆరు ఎకరాలకు విస్తరించారు. రన్‌వే 3,200 మీటర్లకు పెంచి అతి పెద్దదిగా తీర్చిదిద్ది 2023లో ప్రారంభించారు.పూర్తి స్థాయిలో కేంద్ర నిధులతో రూ.370 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది మార్చి కల్లా అదానికి అప్పగించేందుకు కేంద్ర ప్రబుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
పెరిగిన విమానాల సంఖ్య
తిరుపతి ఎయిర్‌పోర్టుకు విమానాల ట్రాఫిక్ పెరిగింది. గతేడాది రోజూ ఏడు విమానాలు వచ్చి పోతుండేవి. ప్రస్తుతం 16 విమానాలకు ఈ సంఖ్య పెరిగింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్‌కు చెందిన విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, సూరత్, బెల్‌గాం, గోవా, కొల్హాపూర్, నాగపూర్, గుల్బర్గ్ ప్రాంతాలకు ఇక్కటి నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రోజూ ఐదారు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.