రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 న ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 25వ తేదీ అని, 26న నామినేషన్లను పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీ అని, మే 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుందని, జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలను వివరించారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే నామినేషన్లను అనుమతించడం జరుగుతుందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలని, నోటిఫైడ్‌ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. పబ్లిక్‌ సెలవు దినాలలో నామినేషన్‌ స్వీకరించబడదన్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్‌ దాఖలు చేయవచ్చన్నారు. 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్‌ చేయడం కుదరదని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3వాహనాలు అనుమతించబడతాయని, 5గురు వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్‌ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్‌ డెస్క్‌ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థి నామినేషన్‌ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుందని చెప్పారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ న్యూస్‌ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.ఎపిక్‌ కార్డులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు :కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఎపిక్‌ కార్డులను పోస్టల్‌ డిపార్ట్మెంట్‌ ద్వారా, ఒకవేళ పోస్ట్‌ నుండి రిటర్న్‌ అయిన వాటిని సంబంధిత బిఎల్వోల ద్వారా మాత్రమే సంబంధిత ఓటర్లకు అందజేయడం జరుగుతోందని ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అలా కాదని తప్పుడు విధానాలు అవలంబిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం ఒక తెలిపారు. జిల్లా నందు 6.1.2023 నుండి 30.3.2024 వరకు మొత్తం 337130 ఎపిక్‌ కార్డులను జనరేట్‌ చేయడం జరిగిందని, అందులో 314710 ఎపిక్‌ కార్డులను ప్రింట్‌ చేసి జిల్లా కలెక్టర్‌ వారికి కార్యాలయంకు పంపడం జరిగినదని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి పోస్టల్‌ కార్యాలయంకు పోస్టల్‌ డిపార్ట్మెంట్‌ ద్వారా బుక్‌ చేసి పంపడం జరిగిందని, పోస్టల్‌ శాఖ ద్వారా 265823 ఎపిక్‌ కార్డులను ఓటర్లకు నేరుగా పంపడం జరిగిందని తెలిపారు. పోస్టల్‌ శాఖ ద్వారా బుక్‌ చేసిన వాటిలో 12875 ఎపిక్‌ కార్డులు పోస్ట్‌ వారి ద్వారా రిటర్న్‌ రావడం జరిగిందని, సదరు రిటర్న్‌ అయిన ఓటర్‌ కార్డులను ఈసీఐ నిబంధనల మేరకు బిఎల్‌ఓ ల ద్వారా 10439 ఓటర్‌ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నేటికీ బిఎల్‌ఓ వద్ద పంపిణీ కొరకు 2436 ఓటర్‌ కార్డులు సిద్ధంగా ఉన్నాయని, అలాగే పోస్టల్‌ డిపార్ట్మెంట్‌ వద్ద పంపిణీ కొరకు 60,868 ఓటర్‌ కార్డులు సిద్ధంగా ఉన్నాయని, ఈ ఎపిక్‌ కార్డులు నేరుగా పోస్ట్‌ ద్వారా ఓటర్‌ కు పంపడం జరుగుతుందని, ఇతర వ్యక్తులకు ఎటువంటి పరిస్థితులలోనూ ఎపిక్‌ కార్డులను జారీ చేయుట, పంపిణీ కొరకు అందజేయడం జరగదని ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని, నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై తప్పక చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

➡️