హిందూయేతర ఉద్యోగులపై చర్యలు

Feb 5,2025 21:50 #ttd, #ttd employees
  • టిటిడిలో 18 మంది గుర్తింపు

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో హిందూయేతర ఉద్యోగులపై యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. వివిధ విభాగాల్లో 18 మంది అధికారులుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారిని తిరుమల టిటిడి అనుబంధ ఆలయాల్లో శ్రీవారి ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలలో విధులు నిర్వహించకూడదని ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడిలో దేవదాయ ధర్మాదాయ శాఖ యాక్టు 1060, 1989 ప్రకారం హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరారని, అయినా హిందూయేతర మత కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబరు 18న జరిగిన పాలకమండలి సమావేశంలో హిందూయేతర ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తీర్మానించింది.
వివిధ విభాగాల్లో అధికారులుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్న 18 మందిని ప్రభుత్వశాఖలకు బదిలీ చేయాలని లేదా విఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి సాగనంపాలని బోర్డు తీర్మానం చేసింది. ఈ మేరకు టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఇఒ శ్యామలరావులను కలిసి బాధిత ఉద్యోగులు తమ బాధలను చెప్పుకున్నారు. అయినా ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

తిరుమల విధులకు దూరంగా : టి.రవి, చీఫ్‌ పీఆర్‌ఓ, టిటిడి.

‘టిటిడిలో అన్యమత ఉద్యోగులు 18 మందిని గుర్తించినది వాస్తవమే. వారిని ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం గాని, విఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపడం గానీ లేదు. తిరుమల, శ్రీవారి ఉత్సవాలకు దూరంగా ఉండేలా వారి విధులు నిర్వహిస్తాం’ అని ప్రజాశక్తికి వివరణ ఇచ్చారు.

➡️