అంబేద్కర్‌ విగ్రహ స్థల పంచాయితీశ్రీ గ్రామస్తుల అభిప్రాయాలు సేకరణ శ్రీ కలెక్టర్‌కు నివేదించనున్న అధికారులు

Oct 9,2024 23:52
అంబేద్కర్‌ విగ్రహ స్థల పంచాయితీశ్రీ గ్రామస్తుల అభిప్రాయాలు సేకరణ శ్రీ కలెక్టర్‌కు నివేదించనున్న అధికారులు

అంబేద్కర్‌ విగ్రహ స్థల పంచాయితీశ్రీ గ్రామస్తుల అభిప్రాయాలు సేకరణ శ్రీ కలెక్టర్‌కు నివేదించనున్న అధికారులుప్రజాశక్తి – సదుం: ఊరికి మంచి చేయాలని అంబేద్కర్‌ విగ్రహాన్ని ఓ వర్గం రాములవారి గుడి సమీపంలో ఏర్పాటు చేస్తుండగా, మరో వర్గం గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండా చేశారని, అక్కడినుంచి విగ్రహాన్ని వేరే ప్రాంతానికి మార్చాలన్న వివాదం తారాస్థాయికి చేరింది. ఇరు వర్గాల ఫిర్యాదులతో బుధవారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహశీల్దార్‌, ఎస్‌ఐ సమయంలో ‘పంచాయితి’ జరిగింది. ఇరు వర్గాల అభిప్రాయాలను విన్న అధికారులు నివేదికను కలెక్టర్‌కు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అప్పటివరకూ గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏదిఏమైనా పెత్తందారులకు వ్యతిరేకంగా వివక్షపై దళితులంతా ఏకమవ్వాల్సి ఉండగా, దళితులే రెండు వర్గాలుగా చీలిపోయి స్థల వివాద సమస్యను సృష్టించుకోవడంపై చర్చ నడుస్తోంది. అమ్మగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కలకటవారిపల్లి దళితవాడలో గ్రామస్తులు అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు పూనుకున్నారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటు స్థల వివాదంపై దళితవాడలోనే అభిప్రాయబేధాలు పొడసూపాయి. కలెక్టర్‌కు ఇరు వర్గాల వారు ఒకటికి రెండుసార్లు ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులతో కమిటీ వేసి మెజార్టీ అభిప్రాయం మేరకు విగ్రహ స్థల సమస్యను పరిష్కరించాలని గత వారం సదుం తహశీల్దార్‌కు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సదుం తహశీల్దార్‌ మారూఫ్‌ హుస్సేన్‌, సదుం ఎస్‌ఐ షేక్‌షా వల్లి, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ డిఎస్‌ హరిబాబు బుధవారం కలకటవారిపల్లి దళితవాడకు వెళ్లి గ్రామస్తులతో విచారణ చేపట్టారు. గ్రామస్తులను పేరుపేరునా పిలిచి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఓ వర్గం వారు దళితవాడలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం ముందు ఏర్పాటు చేసిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని వేరే చోటికి తరలించాలని విన్నవించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఎస్‌ఎ విశ్రాంతి ఉద్యోగి శిబ్వాల యర్రయ్య, పద్మవతమ్మ దంపతులు గ్రామానికి మంచి చేయాలనే అభిప్రాయంతో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అనవసరంగా కొంతమంది విగ్రహ ప్రారంభోత్సవానికి అడ్డు తగులుతున్నారని వాపోయారు. మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని, నిచ్చెనను ఏర్పాటు చేశామని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా గ్రామంలోని ఇంకో వర్గం విగ్రహం ఏర్పాటుపై గ్రామంలో అందరి అభిప్రాయాలను వారు తీసుకోలేదని, కోదండ రామస్వామి దేవాలయం ముందు ఏర్పాటు చేసిన విగ్రహం ప్రహరీ గోడకు అతి దగ్గరగా ఉందని, హిందూ మనోభావాలు దెబ్బతింటాయని, హిందువులకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఇరు వర్గాల అభిప్రాయాలను తీసుకున్న తహశీల్దార్‌ అభిప్రాయాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు. విచారణ సందర్భంగా గ్రామస్తులు పెద్దఎత్తున గుమిగూడారు. తిరుపతి, మదనపల్లి, పీలేరు నుండీ దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కలకట వారి పల్లి దళిత వాడకు చేరుకోవడంతో ఒక దశలో ఇరువర్గాలు మధ్య గలాటాలు జరుగు తాయోమోనని గ్రామస్తుల్లో కొంత ఆందోళన ఏర్పడింది. సదుం ఎస్సై షేక్‌ షావలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో గ్రామ కమిటీ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు యమలా సుదర్శనం, పరమశివం, పోతన్న, మాజీ డిఎస్పి రామచంద్రయ్య, విశ్రాంత లెక్చరర్‌ రామచంద్రయ్య, గుండా మనోహర్‌, యమల చంద్రయ్య, స్థానిక దళిత నాయకులు ఆర్‌ వి రమణ, మల్లేపల్లి శ్రీనివాసులు, రామచంద్రయ్య, శ్రీరాములు, శ్యామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️