నవరత్న నిలయంపై దాడి – విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం – టీడీపీ పనేనన్న వైసీపీ

Jun 10,2024 08:47
నవరత్న నిలయంపై దాడి శ్రీ విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం శ్రీ టీడీపీ పనేన్న వైసీపీ
  • నవరత్న నిలయంపై దాడి
  • విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం
  • టీడీపీ పనేన్న వైసీపీ

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్‌లో నిర్మించిన జగనన్న నవరత్నాల గుడిపై శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. శిలాఫలకాలను, వైఎస్సార్‌ చిత్రపటాలను ధ్వంసం చేశారు. నవరత్నాల నిలయం ముందు నిర్మించిన రైతు గ్రామీణ మహిళ విగ్రహాలను కూడా కూలదోశారు. ఇదంతా టిడిపి నాయకుల పనేనంటూ వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షా వేధింపుల్లో భాగంగానే ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజీవ్‌నగర్‌లో సుమారు 2వేల మంది పేదలకు జగనన్న కాలనీ పేరిట ఇంటి స్థలాలను ఇచ్చారు. కాలనీకి ముందు అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి జగన్‌కు కతజ్ఞతగా నవరత్నాలు నిలయాన్ని నిర్మించారు. ఈ నిలయంలో నవరత్నాలు పథకాలను ప్రతిబింబించేలా కట్టడాలు, వైయస్సార్‌ చిత్రపటాలు, రైతులు, పల్లెటూరి దంపతుల విగ్రహాలు, ఫిర్యాదులు పెట్టి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏడాది జూన్‌ 4న టిడిపి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 40 మందికి పైగా ఆటోలలో హల్చల్‌ చేస్తూ నవరత్నాల గుడిపై దాడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రోడ్డు మార్గంలో రాజీవ్‌నగర్‌ పరీవాహక ప్రాంతమంతా కొందరు వైసిపి నాయకులు ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న అక్రమ కట్టడాలను కూడా కూలదోసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఆ కట్టడాలలో మీటర్లు పగలగొట్టి, బోర్లలో పైపులు బయటకు లాగి మోటరు ఎత్తుకెళ్లారని, ఆ సమయంలో గస్తీకి వచ్చిన పోలీసులను చూసి ఆ దుండగులు పారిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై టూటౌన్‌ పోలీసులను వివరణ కోరగా తమకు మున్సిపల్‌ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలియజేయడం గమనార్హం.

➡️