నేడు చంద్రాభిషేకం!నాలుగోసారి ప్రమాణస్వీకారం

నేడు చంద్రాభిషేకం!నాలుగోసారి ప్రమాణస్వీకారం

నేడు చంద్రాభిషేకం!నాలుగోసారి ప్రమాణస్వీకారం నారావారిపల్లి- ఢిల్లీ వరకూశ్రీ చంద్రబాబు రాజకీయ ప్రస్థానం శ్రీ నేడు కుటుంబసమేతంగా తిరుమలకుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నారా చంద్రబాబునాయుడు నారావారిపల్లి నుంచి ఢిల్లీ వరకూ రాజకీయ ప్రస్థానం సాగించారు. 28ఏళ్ల వయస్సులోనే మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు మూడుసార్లు ప్రమాణస్వీకారం చేసి, నాలుగోసారి నేడు బుధవారం చేయనున్నారు. 1995, 1999లలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తరువాత 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చేశారు. 2024 ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి ఎన్డీఎ కూటమి సిఎం అభ్యర్థిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. కేంద్రంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి కీలకంగా ఉన్నారు. 1996లో అప్పటి ఎన్డీఎ కూటమికి కన్వీనర్‌గా ఉంటూ అప్పటి ప్రధాని వాజ్‌పేయికి ప్రధాన సలహాదారుగానూ ఉన్నారు. ఈసారి ఎన్డీఏ తరపున కీలకంగా వ్యవహరించనున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. చంద్రగిరి మండలం నారావారిపల్లిలో ఓ సామాన్య రైతు నారా ఖర్జూరనాయుడు, అమ్మణ్నమ్మ దంపతులకు మొదటి సంతానం నారా చంద్రబాబునాయుడు. 1950, ఏప్రిల్‌ 20న జన్మించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు చంద్రగిరి ఎంఎల్‌ఎగా 1994లో ఉన్నారు. ఓ చెల్లిని తన ఊరికి పక్కనే ఉన్న కందులవారిపల్లిలో సొంత బావ కనుమూరి చంద్రబాబునాయుడుకు ఇచ్చారు. ఆ తరువాత మరో చెల్లెల్ని కృష్ణా జిల్లా శ్రీనివాస చౌదరికి ఇచ్చారు. నారావారిపల్లిలో స్కూలు లేకపోవడంతో పక్కనే ఉన్న శేషాపురంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. 6-9 వరకూ చంద్రగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో ఉన్నారు. 10 నుంచి తిరుపతి ఎస్వీ హైస్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ, ఎస్వీ యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఎంఎ ఎకనామిక్స్‌ చదివిన చంద్రబాబునాయుడు స్టూడెంట్‌ యూనియన్‌కు లీడర్‌గా ఉన్నారు. 1972లో యువజన కాంగ్రెస్‌ లీడర్‌గా ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పట్లో ఢిల్లీలో జరిగిన ఎన్‌ఎస్‌యుఐలో ఓ సెమినార్‌లో కీలకంగా ప్రసంగించడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మెచ్చుకుని రాజకీయాల్లోకి ఆహ్వానించారు. 1978లో చంద్రగిరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి విజయం సాధించారు. పిన్న వయస్సులోనే సినీ ఆటోగ్రఫీ మంత్రిగా, యువజన క్రీడా శాఖా మంత్రిగా కాంగ్రెస్‌ అవకాశం ఇచ్చింది. అప్పట్లోనే ఎన్టీఆర్‌ సినిమా రంగంలో ఉండడంతో ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు. 1981లో ఎన్టీఆర్‌ కూతురు భువనేశ్వరిని ఇచ్చి అల్లున్ని చేసుకున్నారు. అయితే 1983లో చంద్రగిరిలో కాంగ్రెస్‌ తరపునే పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడుతో తలపడి 21వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఎన్టీఆర్‌ ప్రభంజనం వీచడంతో సొంత ఊరిని వదిలిపెట్టి 1984 ఉప ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీచేసి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటి నుంచి కుప్పం కంచుకోటగా హవా కొనసాగుతూనే ఉంది. ఎనిమిదోసారి కుప్పం నుంచి పోటీచేసి తాజాగా 48వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాబు అనుభవించిన కీలక పదవులు 1994లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నారా చంద్రబాబునాయుడు కుప్పం నుంచి గెలిచి ఆర్థిక, రెవెన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. 1995లోనే ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడంతో ఆ పార్టీలో సంక్షోభం నెలకొంది. 1996లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1999లోనూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1996లో ఎన్డీఎ కూటమికి కీలకంగా వ్యవహరించారు. 2003లో అలిపిరి బాంబుబ్లాస్ట్‌ ఘటన జరగడంతో ఏడాదికి ముందే ఎన్నికలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్లాయి. అప్పటినుంచే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ వచ్చాయి. వైఎస్‌ఆర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యలు సిఎంలుగా ఉన్నపుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. 2019లో 23 సీట్లతో సరిపెట్టుకున్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఐదేళ్ల పాటు ఉన్నారు. 2024 ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీతో ఎన్డీయే కూటమి తాజాగా 164 సీట్లు సాధించి సిఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేడు తిరుమలకు రాకబుధవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌, కోడలు బ్రహ్మిణి, మనవడు దేవాన్ష్‌, బావమరిది నందమూరి బాలకృష్ణ తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రచారానికి ముందు, తరువాత, అరెస్టు అయ్యి విడుదల అయిన తరువాత నారా చంద్రబాబునాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అత్యధిక మెజార్టీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అనంతరం మరోసారి చంద్రబాబు కుటుంబ సమేతంగా బుధవారం తిరుమలకు వచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

➡️