నారావారిపల్లికి చంద్రబాబు కుటుంబంచురుగ్గా నారా రామ్మూర్తి కర్మక్రియల ఏర్పాట్లుప్రజాశక్తి – రామచంద్రాపురం (చంద్రగిరి)మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల ఏర్పాట్లు నారావారిపల్లెలో నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రమే చంద్రబాబు కుటుంబం నారావారిపల్లికి చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పి సుబ్బరాయుడు ఇతర జిల్లా ఉన్నతా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రితో పాటుగా కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రానుండడంతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రికి వివరించారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే పులివర్తి నాని మండల నాయకులను ఆదేశించారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో తుఫాను ప్రభావం ఉన్నందున జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు.బుధవారం సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. టీటీడీ ఈవో శ్యామల రావు, జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ , ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివి ఎస్వో శ్రీధర్, అదనపు ఈఓ సి.హెచ్ వెంకయ్య చౌదరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఆరని శ్రీనివాసులు, భాను ప్రకాష్, ఎంఎల్‌ఏ థామస్, ఎంఎల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి నారావారి పల్లెకు రోడ్డు మార్గాన బయల్దేరి వెళ్లారు.