వచ్చేది మోడీ , జగన్‌ల వ్యతిరేక ప్రభుత్వమే : చింతామోహన్‌

May 28,2024 22:05
వచ్చేది మోడీ , జగన్‌ల వ్యతిరేక ప్రభుత్వమే : చింతామోహన్‌

ప్రజాశక్తి – తిరుపతి సిటి వైయస్సార్‌ వారసుడని , ఒక్క ఛాన్స్‌ ఇద్దామని ఓటర్లు అభిప్రాయపడటం వల్లనే వైయస్‌ జగన్‌ సీఎం అవగలిగాడని కాంగ్రెస్‌ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతా మోహన్‌ వెల్లడించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా ముందు యార్లపల్లి గోపి తదితరులతో కలసి ఆయన మాట్లాడుతూ.. ఏపీకి రాజధానిగా తిరుపతిని చేయాలని తాను డిమాండ్‌ చేయడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. దీంతో తనుకు కాంగ్రెస్‌ తిరుపతి ఎంపీ సీట్‌ రానీకుండా కొంతమంది అడ్డుపడ్డారన్నారు. దేశం మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీకి కన్యాకుమారి నుండి రామేశ్వరం వరకు ఎస్సీలు , ముస్లిమ్స్‌ అధిక సంఖ్యలో ఓట్లు వేశారని కొనియాడారు. కాంగ్రెస్‌ కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వడంతో తిరుపతిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయిందని, లోపాయకారి ఒప్పందంతో (సిపిఐ) కంకి కొడవలికి కట్టబెట్టడం పట్ల అయిష్టతను వ్యక్తం చేశారు. శ్రీవారి నిధులను తిరుపతి అభివద్ధికి కేటాయించడం సమంజసమన్నారు. టీటీడీ అనుబంధ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్విమ్స్‌ హాస్పిటల్‌ లో డబ్బు కట్టందే వైద్యం చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చే ఫండ్స్‌ తో వేలూరు సిఎంసి లో ఉచిత వైద్యం ఉండేదన్నారు. నేడు విరాళాలు రాకపోవడం వలన పేమెంటు లేనిదే వైద్యం లేకుండా పోయిందని పేదవాడి వైద్యంపై ఆయన స్పందించారు. టీటీడీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. రూయా ఆసుపత్రి నందు పైతాలజీ ట్రీట్మెంట్‌ డిపార్ట్మెంట్‌ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ చిక్కుల్లో ఉందని కోలుకోవడానికి వందేళ్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ తిరిగి అభివద్ధి పథంలో ముందుకెళ్లాలంటే.. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన రావాలని .. అప్పుడే అది సాధ్యమన్నారు.

➡️