నగరంలో సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి

Feb 1,2025 13:25 #Tirupati district

కమిషనర్ ఎన్.మౌర్య
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని డివైడర్లు, కూడళ్ళ లో జరుగుతున్న సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని సుబ్బలక్ష్మి కూడలి, రామానుజ కూడలి, లీలామహల్ కూడలి, తదితర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు, గొల్లవానిగుంటలో క్రికెట్ స్టేడియం పనులను, పాత మునిసిపల్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కూడళ్లు, డివైడర్ల లో రంగు రంగుల పూల మొక్కలు నాటి, పచ్చదనం పెంచాలని అన్నారు. అన్ని చోట్ల గోడలకు అందమైన చిత్రాలు, పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లవానిగుంట వద్ద నిర్మించిన క్రికెట్ స్టేడియం ను పరిశీలించారు. పెండింగ్ ఉన్న పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే ప్రహరీ గోడలకు రంగులు వేయించి, చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. పాత మునిసిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ ను పరిశీలించి గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో మార్పులు, చేర్పులు సూచించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, డి.ఈ.లు రాజు, రమణ, ఏఈకామ్ ప్రతినిధులు బాలాజి, అనిల్, అఫ్కాన్స్ సంస్థ ప్రతినిధి స్వామి, తదితరులు ఉన్నారు.

➡️