శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

May 25,2024 21:40 #Crowd, #Tirumala Temple

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎపి డిప్యూటీ సిఎం బోడి ముత్యాలనాయుడు, ఎపి మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు బ్రిజేంద్రనాథ్‌ రెడ్డి, అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి వచ్చిన సందర్శకులతో తిరుమల పోటెత్తింది. గత పది రోజుల్లో శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాలోనే దాదాపు 2.60 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సందర్శకుల సౌకర్యార్థం అక్టోపస్‌ భవనం నుండి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేశారు.
మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ క్యూలైన్లలో 50 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో ఉప్మా, పొంగల్‌ ఉన్నాయి) పంపిణీ చేశారు. పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టిటిడి విజిలెన్స్‌, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. సందర్శకుల అధిక రద్దీ కారణంగా జూన్‌ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు సందర్శకుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

➡️