కమిషనర్ ఎన్.మౌర్య
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : ఇంటి నుండి ఉత్పత్తి అయ్యే చెత్తతో ఎరువు తయారు చేసుకుని (హోంకంపోస్టింగ్) మొక్కలకు వినియోగించుకునే విధానంపై ప్రజల్లో ఆవాహన పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలో ఖాదీ కాలని, రైల్వే స్టేషన్, ఆటో నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజినీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలసి కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎవరి ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను వారే ఎరువుగా చేసే మొక్కలకు వినియోగించుకునేలా హోమ్ కంపోస్టు పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వీధుల్లో, కాలువల్లో చెత్త వేయకుండా చూడాలని, అలా ఎవరైనా చేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ కాలువలు బ్లాక్ కాకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ లు రమణ, మధు, ఏసిపిలు బాలాజి, మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, తదితరులు ఉన్నారు.
