గరుడ సేవ ఏర్పాట్లపై ఈవో సమీక్షప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 8వ తేదీన జరిగే గరుడసేవకు లక్షలాదిగా విచ్చేసే భక్తులపై ప్రత్యేక దష్టి సారించి ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో మంగళవారం సాయంత్రం అదనపు ఈవో గరుడ సేవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా వాహనాల ముందు ప్రదర్శించే వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కతిక బందాల ప్రదర్శనలకు సంబంధించిన వీడియోను అదనపు ఈఓ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నాలుగు మాడ వీధులలో అన్న ప్రసాద వితరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధ్యయనం చేశారు. ఇందులో అన్నప్రసాదాల తయారీ, పంపిణీ మార్గాలు, గ్యాలరీలలో ఉన్న భక్తులకు సజావుగా అన్నప్రసాదాలు పంపిణీ అయ్యేలా ఇతర విభాగాలతో సమన్వయం చేయడంపై చర్చించారు. సమావేశంలో రవాణా శాఖ జిఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, ఆశాజ్యోతి, హెచ్‌డీపీపీ , విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.