మోటార్ల భద్రతపై ‘అన్నదాతల’ కలవరం

మోటార్ల భద్రతపై 'అన్నదాతల' కలవరం

మోటార్ల భద్రతపై ‘అన్నదాతల’ కలవరం ప్రజాశక్తి- డక్కిలివెంకటగరి నియోజకవర్గంలో తెలుగుగంగ కాల్వలకు మోటార్లు ఏర్పాటు చేసుకొని పంటలు సాగు చేసుకొంటున్న రైతులకు నిద్రలేని రాత్రులు తప్పడం లేదు. ఒకప్పుడు విద్యుత్తు ఎప్పుడు సరఫరా అవుతుందా అని ఎదురుచూస్తూ మోటార్ల వద్ద కాపలా కాసేవారు. నేడు అన్నదాతలకు మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా చిల్లర దొంగతనాలకు అలవాటు పడిన చోరులు రైతుల వ్యవసాయ మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. మోటార్లు లేకపోతే కేబుల్‌ వైర్లను చోరీ చేస్తున్నారు. తీగల్లో ఉన్న కాపర్ను బయటకు తీసి బహిరంగ మార్కెట్టులో విక్రయించి, సొమ్ము చేసుకొంటున్నారు. మోటార్‌ నుంచి స్టార్టర్‌ వరకు ఉండే వైరును ఎక్కువగా కాపర్‌ ఉన్నదానినే ఏర్పాటు చేస్తారు. తెలుగుగంగ కాలువ వెంబడి ఎక్కువగా ఓపెన్‌ సబ్‌ మెర్సీ బుల్‌ మోటార్లు నీటి లో ఉండేవి కావడంతో స్టార్టరు నుంచి మోటార్‌ వరకు కాలువ లోతు ఉన్నంత వరకు వైరు ఉంటుంది. దీంతో దొంగలు వాటిని టార్గెట్‌ చేసి చోరీకి పాల్పడుతున్నారు. గతంలో కాపర్‌, ఆయిల్‌ కోసం విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్ల దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మధ్య ట్రాన్స్‌ ఫార్మర్ల చోరీకి కొంత బ్రేక్‌ పడగా మోటర్ల వద్ద చోరీలు జరుగుతున్నాయి. గతంలో వెంకటగిరి ప్రాంతంలో పెట్లూరు, మొగల్లగుంట డక్కిలి మండలం లోని తెలుగుగంగ కాలువ వెంబడి పంపుసెట్ల వద్ద నుంచి స్టార్టర్‌ లు, పంట భూముల వద్ద నుంచి ఊటబావుల మోటార్లను ఎత్తుకెళ్లేవారు. ప్రస్తుతం తెలుగుగంగ కాలువ ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో మోటార్లు చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని , రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం మోటార్లు వినియోగించే అవకాశం లేనందున వాటిని తీసి భద్రపరచుకోవాలనీ డక్కిలి ఎస్‌ఐ చౌడయ్య సూచిస్తున్నారు.

➡️