డిసెంబర్లో లక్ష మందికి ఇళ్లు పీఎంఏవై 1.0లో 50 శాతం ఇళ్ల నిర్మాణాలు హౌసింగ్ శాఖ అక్రమాలపై విచారణ మీడియా సమావేశంలో మంత్రి పార్థసారధి ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ప్రధానమంత్రి ఆవాజ్ యోజన 1.0 ద్వారా చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో హౌసింగ్ శాఖ ద్వారా 50 శాతం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, డిసెంబర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు దాటుతున్న సందర్భంగా లక్ష మంది హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను ఇచ్చేలా నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ గహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో విలేకరుల సమావేశంలో మంత్రి పలు విషయాలను మీడియాకు వివరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీఎంఏవై 1.0లో ఇసుక కొరత కారణంగా పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదన్నారు. దీనిపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇసుక కొరత లేకుండా హౌసింగ్ లేఔట్లకు నేరుగా ఇసుకను రవాణా చేసుకునేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకుగాను ఇసుక రవాణాకు సంబంధించిన బిల్లులను హౌసింగ్ శాఖ ద్వారా చెల్లించే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. కుప్పంలో విద్యుత్ శాఖ, రెస్కో సొసైటీ మధ్య ఉన్న సమాలోచన లోపంతో అక్కడ విద్యుత్ మీటర్లను ఇంకనూ బిగించాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం పెంపొందించడానికి సబ్ స్టేషన్లను నిర్మించనున్నామన్నారు. హౌసింగ్ లేఔట్లలో మౌలిక వసతుల కల్పనను గత వైసిపి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం నరేగా నిధులతో హౌసింగ్ కాలనీలలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చొరవతో సిసి రోడ్లు వేసేలా నిర్ణయించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అయితే అమత్ పథక నిధులను వినియోగించనున్నామన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేసుకొని 15 రోజులలో బిల్లు పెడితే మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో ఆ బిల్లులను హౌసింగ్ శాఖ చెల్లిస్తుందన్నారు. అలా చెల్లింపులు జరగకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకోకుండానే బిల్లులు పొందినట్టుగా ఆరోపణలు ఉన్నాయని, దీనిపై కూడా సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. మార్చి తరువాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0ను ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరి సొంత ఇంటి కల నిజం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను పక్కన పెట్టేసారన్నారు. ఇక్కడ ఇంకో మోసానికి జగన్ ప్రభుత్వం తెరలేపిందన్నారు. లబ్ధిదారుల పేరుపై ప్రభుత్వమే రుణాలు పొంది, ఆ నిధులను దేనికి ఖర్చు చేశారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని, త్వరలో నూతన అక్రిడియేషన్ పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చి అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి జర్నలిస్టులకు అందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, వెంకటగిరి ఎమ్మెల్యే రామకష్ణ, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు.