సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట : సిఐటియుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట పట్టక తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జి.బాలసుబ్రమణ్యం, కందారపు మురళి హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ధర్నా నిర్వహించి, అనంతరం సమ్మె నోటీసును రుయా సూపరింటెండెంట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె నోటీసు అందజేసిన 14 రోజుల్లో సమస్యలను పరిష్కరించని యెడల సమ్మెలోకి వెళతామన్నారు. గతంలోనూ అనేకమార్లు వినతిపత్రాలు అందజేశామని గుర్తు చేశారు. హామీలు తప్ప, పరిష్కారం చూపలేదన్నారు. రుయాలో గతంలో 500 పడకలు ఉన్నపుడు ఎంఎన్‌ఒ ఎఫ్‌ఎన్‌ఒ తోటీలు, మహిళా బార్బర్లు, పురుష బార్బర్లు 250 మంది పనిచేసేవారని, ఇపుడు ఆస్పత్రి విస్తరించి 1268 పడకలు ఉన్నా కార్మికుల సంఖ్య బెడ్లకు అనుగుణంగా పెరగకపోగా తగ్గించారన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య 85 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఒక్కో కార్మికుడు, కార్మికురాలు 13 వార్డుల్లో పనిచేయాల్సి వస్తుందన్నారు. పనిభారంతో కార్మికులు బీపీలు, సుగర్, హార్ట్ అటాక్‌లతో ఒత్తిడితో కూడిన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ధర్నాలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్, రుయా ఆస్పత్రి కార్యదర్శి బి.గురవయ్య మాట్లాడుతూ బతికున్న మనిషిని వార్డులకు షిఫ్ట్ చేయాలంటే అంబులెన్స్ సౌకర్యం ఉందని, ఒకవేళ దురదృష్టవశాత్తు మనిషి చనిపోతే తరలించడానికి ఎటువంటి సౌకర్యం లేదన్నారు. టీబీ వార్డులో చనిపోతే అక్కడనుంచి మెయిన్ బిల్డింగ్‌కు తీసుకురావడానికి కిలోమీటర్ దూరం ఉందన్నారు. ఒక్కోసారి మహిళలకు కూడా పురుషులే షేవింగ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పడకలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలని, కార్మికులకు రెస్ట్‌రూమ్ కల్పించాలని 22 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి.సుబ్రహ్మణ్యం, చినబాబు, మునిరాజా బుజ్జి, చిన్న, వాసు, ఆనంద్, రుయా ఆసుపత్రి కమిటీ నాయకులు యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింహులు, అధ్యక్షులు ముని చంద్ర, మధు, సుబ్రహ్మణ్యం, శివకుమార్, అన్నా స్వామి, కాంచన, నవమణి, రాధా, శాంత కుమారి, దేవి పాల్గొన్నారు.
