బదిలీ చేస్తే మాకేంటి..?శ్రీకాళహస్తి ఆలయ ఉద్యోగుల తీరు100 రోజులైనా పట్టించుకోని ‘కూటమి’ప్రజాశక్తి – శ్రీకాళహస్తి టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులపై బదిలీ వేటు పడింది. మరికొంతమందిపైనా బదిలీ వేటు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే బదిలీల విషయం అంటుంచితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ‘బదిలీ చేస్తే మాకేంటి’ అన్న పంథాలో వారి తీరు ఉంది. ఉన్న చోట పని చేయరన్న విమర్శలు ఏళ్ల తరబడి వినిపిస్తూనే ఉన్నాయి. తమ పలుకుబడి వినియోగించి ఆదాయ మార్గాలు అధికంగా వచ్చే చోట విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. దీంతో తమను బదిలీ చేసినా తమకేం భయం లేదన్న ధోరణిలో కొందరు ఉద్యోగుల తీరు కనిపిస్తోంది. ఉదాహరణకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో 35 మంది వేద పండితులు, 36 మంది అర్చకులు, 25 మంది పరిచారకులు స్వామి అమ్మవార్లకు నిత్య సేవలు చేస్తూ ఉన్నారు. వీరిలో వేద పండితులు వేదమంత్రాలను, అర్చకులు స్వామి అమ్మవార్లకు, పరివార దేవతలకునిత్య కైంకర్యాలు చేయాల్సి ఉంటుంది. పరిచారకులు వీరికి సహాయకులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే పరిచారకుల్లో కొందరు అర్చకుల అవతారమెత్తి రాహు-కేతు మండపాల వద్ద, పరివార దేవతల ముంగిట హారతి పళ్లాలు పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పరిచారకుల విధి ప్రసాదాల పోటులో సహాయకులుగా, పర్యవేక్షకులుగా ఉండడం. అయితే ప్రసాదాల పోటును మరిచి ఆలయం లోపలే కొంతమంది పరిచారకులు ఎక్కువసేపు గడుపుతున్నట్లు సమాచారం. దీంతో ప్రసాదాల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి లడ్డు నాణ్యత పై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు ముక్కంటికి పాకాయి. ఈ క్రమంలో మరింత బాధ్యతగా పరిచారకులు వ్యవహరించాల్సి ఉంది. గత వైసిపి పాలనలో శ్రీకాళహస్తి ఆలయం భ్రష్టు పట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. అన్ని విధాలుగా అవినీతి అక్రమాలు జరిగాయనీ, దళారులు రాజ్యమేలినట్లు కూటమి నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తాం..విచారణ చేయిస్తాం… బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గొప్పలు పోయారు. అయితే అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా అవినీతి అక్రమాలపై కనీసం ప్రాథమిక విచారణ కూడా జరగలేదు. ఎవరిపై ఎటువంటి చర్యలు లేవు. ఆలయంలో ముఖ్యమైన ఇద్దరు అధికారులు బదిలీ అయ్యారు. ఒకరు ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారి కాగా, మరొకరు ఆలయ పరిపాలన అధికారి. ఇంకొందరు కింది స్థాయి ఉద్యోగులు. గత ప్రభుత్వ హయాంలో టెండర్లు, కొటేషన్లు, అంచనాలు లేకుండా ఇష్టం వచ్చిన విధంగా పనులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ పనులు ఒకే కాంట్రాక్టర్ ద్వారా చేయించారన్న విమర్శ ఉంది. అనాటి నాయకులకు బాగా ”సాయం” చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరో అధికారి కలెక్షన్ కింగ్‌గా వ్యవహరించారు. ఆలయంలో అయ్యవార్ల వద్ద వసూలు చేయడంలో ఆయన దిట్ట. జరిగిన వసూళ్లలో నాయకులకు వాటాలు ఇవ్వడంలో ఆరితేరిన వ్యక్తి. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటినా ఎవరిపైనా ఎటువంటి విచారణలు జరగకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే ఇతరులు జాగ్రత్త పడతారు. మరోసారి అటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అయితే ఆ దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ‘దొందూ.. దొందేనని’ జనాలు అనుకుంటుండటం గమనార్హం.
బదిలీ చేస్తే మాకేంటి..?శ్రీకాళహస్తి ఆలయ ఉద్యోగుల తీరు100 రోజులైనా పట్టించుకోని ‘కూటమి’
