అక్రమలకు అం(పం)డగ…

May 28,2024 22:06
అక్రమలకు అం(పం)డగ...

లంచాల మత్తులో అధికారులు యథేచ్ఛగా తవ్వకాలు ప్రజాశక్తి – నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేటలో అనుమతులు లేని అక్రమ తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమ వ్యాపారులు రోజురోజుకి మరింత విచ్చలవిడిగా చెలరేగిపోతూ ‘ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇస్తున్నాం, ఏ అధికారి మమ్మల్ని అడ్డుకుంటాడు చూస్తాం’ అంటూ మీడియా ముందే అధికారులకు బహిరంగంగా సవాల్‌ విసురుతున్నారు. అక్రమ తవ్వకాల వెనుక బడాబడా నాయకులు ఉండడంతో ఏ అధికారీ సాహసించి అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు. మీడియాలో వచ్చినా అది షరా’మామూలే’ అన్న చందంగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నాయుడుపేటలోనే కాదు, చుట్టుపక్కల మండలాల్లోనూ అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. నాయుడుపేటలోని ఓ ప్రముఖ వ్యక్తికి టిప్పర్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రైవేట్‌ వెంచర్లను కాంట్రాక్టు తీసుకుని ఈయన వాహనాల్లోనే కాకుండా, వేరొకరి వాహనాలనూ తెప్పించుకుని మట్టి, గ్రావెల్‌ రవాణా చేస్తుంటాడు. తవ్వడానికి, రవాణాకు ఎటువంటి అనుమతి తీసుకోకపోవడం జగమెరిగిన సత్యం. ప్రభుత్వానికి పన్ను సైతం చెల్లించడు. రేయింబవళ్లు ఇష్టానుసారంగా రవాణా కొనసాగిస్తుంటాడు. ప్రభుత్వాధికారులతోనే కాదు, పెద్దపెద్ద నాయకులతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. చుట్టుపక్కల మండలాల్లో ఎలాంటి ప్రైవేట్‌ వెంచర్‌ వేస్తున్నా, వారినుంచి ఆయనకు పిలుపు రావాల్సిందే. ఆయన చేస్తున్న అక్రమ వ్యాపారానికి పన్ను కట్టాల్సి వస్తే ఏడాదికి కోట్లల్లోనే ఉంటుంది. అప్పగిస్తే చర్యలు తీసుకుంటాం : మైనింగ్‌ మైనింగ్‌ అధికారిని ఫోన్‌లో వివరణ కోరగా ‘మాకు సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఒకవేళ మేం స్పందించి వచ్చినా దొరకడం లేదు. స్థానిక అధికారులకూ వారిని అడ్డుకునే అధికారం ఉంది. వారు అదుపులోకి తీసుకుని మాకు అప్పగిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. స్థానిక అధికారులను సంప్రదించగా మైనింగ్‌ అధికారులదే మెయిన్‌ బాధ్యతని, వారే పట్టించుకోకపోతే మాకెందుకు అని వీరు దాటవేస్తుండటం గమనార్హం.

➡️