‘ప్రైవేట్’లో విద్యార్థుల భద్రత పట్టదా? ప్రజాశక్తి-శ్రీకాళహస్తి ఒకపక్క బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని జిల్లా అధికార యంత్రాంగం ముప్పు ప్రకటించి పెద్ద ఎత్తున ముందస్తు సహాయక చర్యలను చేపడుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు తిరుపతి జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అయితే శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సోమవారం తరగతులు నిర్వహించాయి. దీంతో విద్యార్థులు వర్షంలో తడుస్తూ స్కూళ్లకు వెళ్లాల్సి వచ్చింది. ముప్పు హెచ్చరికల నేపథ్యంలో సైతం ప్రైవేటు స్కూళ్లలో తరగతుల నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల భద్రతపై బాధ్యత లేదా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు చుట్టు గురవయ్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు జాకీర్ సోమవారం పలు ప్రయివేట్ స్కూళ్ల వద్దకు వెళ్లి తరగతులు నిర్వహించడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో కొన్ని స్కూళ్లలో విద్యార్థులను ఇళ్లకు పంపి వేయగా, పలు పాఠశాలలు మొండిగా తరగతులు నిర్వహించాయి. వీటిపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని నాయకులు ప్రశ్నిస్తున్నారు. సహాయక చర్యల్లో ఆర్డిఓతుఫాను హెచ్చరిక నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి సోమవారం స్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీకాళహస్తి నియోజవర్గం పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఆయా ప్రాంతాలను ఆర్డిఓ గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. వారికి నిత్యావసరాలు సమకూర్చడంతో పాటు భోజన వసతిని కల్పించారు. శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని వేడాం ఎస్టీ కాలనీ, భైరవకోన ఎస్టీ కాలనీల్లో ఆర్డీవో పర్యటించి వారికి ముందస్తు జాగ్రత్తలు సూచించారు. రానున్న తుఫాన్ పట్ల గ్రామాల్లోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తొట్టంబేడు మండల టిడిపి అధ్యక్షులు గాలి మురళి నాయుడు సూచించారు. వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి చెట్ల కింద నిలబడడం, కరెంటు స్తంభాల పక్కన ఉండటం లాంటివి చేస్తే పిడుగుపాటుకు గురై మరణించే ప్రమాదం ఉందని తెలిపారు. వర్షాల కారణంగా ఏ ఇబ్బంది ఎదురైనా హెల్ప్ లైన్లను ఉపయోగించుకోవాలని సూచించారు.